చైనా ఏప్రిల్ 29న ప్రయోగించిన లాంగ్ మార్చ్-బి రాకెట్ నియంత్రణ కోల్పోయి కక్ష్య నుంచి భూమిపైకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ రాకెట్ శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోయినట్టు గుర్తించారు. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన చైనా రాకెట్ హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్టు చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది.
ఈ రాకెట్ బరువు 18 టన్నులు కాగా.. అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్యలకు పోటీగా అంతరిక్షంలో సొంత స్టేషన్ ఏర్పాటుకు చైనా ప్రయత్నించింది.
‘‘పర్యవేక్షణ, విశ్లేషణ తరువాత మే 9న ఉదయం 10.24 గంటలకు లాంగ్ మార్చి 5బి యావో-2 వాహనం చివరి దశ శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. 72.47 ° తూర్పు రేఖాంశం, 2.65 °ఉత్తర అక్షాంశం వద్ద హిందూ మహాసముద్రంలో కూలిపోయాయి’’ అని చైనా మీడియా సీసీటీవీ వెల్లడించింది. లాంగ్‌మార్చ్-5బి వల్ల నష్టం జరిగే అవకాశాలు చాలా తక్కువని, రాకెట్ శకలాలు భూమిని తాకే లోపు వాతావరణంలోనే మండిపోతాయని శుక్రవారం చైనా ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా చైనా మొదటి మాడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించడం కోసం ఏప్రిల్ 29న లాంగ్‌మార్చ్ 5బి రాకెట్ తియాన్హే స్పేస్ మ్యాడుల్‌ను 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. అక్కడ నియంత్రణ కోల్పోయిన రాకెట్ శకలాలు భూమి మీదకు దూసుకొచ్చాయి. చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ సముద్రంలో కాకుండా భూమిపై పడుతుందనే ప్రచారం జరిగింది.
దీని శిథిలాలు ఏ ప్రాంతంలో పడతాయే అర్ధంకాక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, చివరకు హిందూ సముద్ర జలాల్లో కూలిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ భూమిపై పడుంటే భారీ ప్రాణ నష్టం జరిగుండేంది. ఈ రాకెట్‌ను అమెరికా సైన్యం కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ దేశ రక్షశాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఖండించారు.