మాదాపూర్‌లో చలివేంద్రం, ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
చిన్న సహాయం సమాజంలో సమాజంలో పెద్ద మార్పులు తెస్తుందని, సమాజ సేవ నిజమైన సేవగా భావించి మాదాపూర్‌లో చలివేంద్ర కేంద్రం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.
ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్, శ్రీ సిగ్మా హాస్పిటల్ సంయుక్తంగా శేరిలింగంపల్లిలోని మాదాపూర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కేంద్రాన్ని రాజ్ న్యూస్ ఛానల్ చైర్మన్ లక్ష్మీ రావు బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో దుండ్ర కుమారస్వామి, ప్రముఖ నటుడు రాజా రవీంద్ర అతిథులుగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు . వేసవి కాలంలో పాటించవలసిన ఆరోగ్య నియమాలతో కూడిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ రావు, ప్రముఖ దర్శకుడు శ్రీవాసు, జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ అధినేత డాక్టర్ సరికొండ వినయ్, కార్డియాలజిస్ట్ విశ్వనాథ్, సిగ్మా హాస్పిటల్ ఎండీ శ్రీనివాస్ , పూజతో పాటు మేధావులు, ఐటీ నిపుణులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
లక్ష్మీ రావు మాట్లాడుతూ, నిరుపేదలకు ఆరోగ్య సేవలు, ఉచిత వైద్య పరీక్షలు అందించడం సామాజిక బాధ్యతను నెరవేర్చే గొప్ప కార్యమని అన్నారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ పేదలు, అణగారిన వర్గాల ఉన్నతికి చేస్తున్న కృషి ప్రశంసనీయమని, ఈ చలివేంద్రం ద్వారా కార్మికులు, సామాన్యులకు ఉచిత శీతల పానీయాలు అందించి వేసవిలో ఉపశమనం కల్పించడం లక్ష్యమని తెలిపారు.
సిగ్మా హాస్పిటల్ ఎండీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆరోగ్య సేవలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, వేసవిలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
స్థానికులు ఈ కార్యక్రమాన్ని హర్షించి, బ్లిస్ బర్గ్, సిగ్మా హాస్పిటల్ సంయుక్త కృషిని అభినందించారు.
బ్లిస్ బర్గ్ సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి చలివేంద్రాలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేందుకు పణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్థలు తెలిపాయి. ఈ కార్యక్రమం సామాజిక సేవలకు ఆదర్శంగా నిలిచిందని, ఇతర సంస్థలకు స్ఫూర్తినిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్లిస్ బర్గ్ ప్రతినిధులు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమ రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే లక్ష్యంతో పనిచేస్తామని తెలియజేశారు.
