చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. అయితే ఈ ఘటనలో ల్యాండర్ ధ్వంసం కాలేదని వెల్లడించింది. విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ విషయమై ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘చంద్రుడిని ఢీకొన్న విక్రమ్ ముక్కలు కాలేదు.
ఓ పక్కకు పడిపోయి ఉంది. దక్షిణ ధ్రువంలో మేం ల్యాండర్‌ను దించాలనుకున్నచోటుకు చాలా దగ్గరలో విక్రమ్ ఉన్నట్లు గుర్తించాం. విక్రమ్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రోలో ఓ బృందం అవిశ్రాంతంగా పనిచేస్తోంది’ అని చెప్పారు. ఇస్రో జీఎస్‌ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా జూలై 22న చంద్రయాన్–2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈనెల 7న తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ జాబిల్లివైపు పయనమైంది. చంద్రుడికి 2.1 కి.మీ ఎత్తులో విక్రమ్ ఉండగా, కమాండ్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయి.