కరోనాపై పోరుకు కేంద్రం ‘కొవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, వైద్యారోగ్య వ్యవస్థ సమాయత్తత’ పేరుతో ప్యాకేజీని ఆమోదించింది. దేశంలో వైద్యారోగ్యవ్యవస్థను బలోపేతం చేయడం, కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం ఈ ప్యాకేజీ లక్ష్యం. ఇందులో భాగంగా కేంద్రం రూ.7,774 కోట్లను మూడు దశల్లో అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలితప్రాంతాలకు విడుదల చేయనున్నారు. మొదటిదశ.. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ వరకు, రెండో దశ.. జూలై నుంచి 2021 మార్చి వరకు, మూడో దశ.. 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ఉంటుంది. తొలిదశలో రూ.1500 కోట్లు విడుదల చేసింది.
అత్యవసర చర్యలు చేపట్టండి
ఈ నిధులతో ప్రత్యేక దవాఖానలు, ఐసొలేషన్ వార్డులు, ఐసీయూలు ఏర్పాటుచేయాలని, అత్యవసర పరికరాలు, ఔషధాలు కొనాలని, ల్యాబ్‌ల సామర్థ్యం పెంపు, కొత్త ల్యాబ్‌ల ఏర్పాటు, అదనపు సిబ్బంది నియామకం, వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు వంటివి చేపట్టాలన్నారు. దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాలు, తదితర ప్రాంతాలను డిస్‌ఇన్ఫెక్షన్ చేయా లని కేంద్రం సూచించింది.
1.7 కోట్ల పీపీఈ కిట్లు
దేశంలో వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లు (పీపీఈ) సరిపడా అందుబాటులో ఉన్నాయని కేంద్ర వైద్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అదేసమయంలో వీటిని అవసరమైనంతమేరకే వాడాలని కోరారు. ప్రస్తుతం దేశంలో 20 సంస్థలు పీపీఈ కిట్లను తయారు చేస్తున్నాయని, 1.7 కోట్ల కిట్లకు ఆర్డర్ ఇచ్చామన్నారు. 49వేల వెంటిలేటర్లకు ఆర్డర్ ఇవ్వగా, సరఫరా జరుగుతున్నదన్నారు. రైల్వేశాఖ ఆరు లక్షల పునర్వినియోగ మాస్కులను, నాలుగువేల లీటర్ల శానిటైజర్‌ను అందిస్తున్నదని చెప్పారు. ఐదువేల ఐసొలేషన్ కోచ్‌లను అందుబాటులోకి తెస్తుందని చెప్పారు.