సామాజిక మార్పుకు మండల్ రిపోర్టు నాంది పలికింది – డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఛైర్మన్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్
బీపీ మండల్ దేశ ప్రజల పై చెరగని ముద్ర. – జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
అసమానతలు, పీడనలు, వేదనలతో కృంగిపోతున్న బీసీల జీవితాలలో మండల్ కమిషన్ సిఫారసులు సామాజిక మార్పుకు, న్యాయంకు దోహదం చేశాయని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. మండల్ రిపోర్టులోని సిఫారసులతో బీసీలకు జాతీయ స్థాయిలో విద్య, ఉద్యోగ రంగాలలో 27% రిజర్వేషన్లు అమలులోకి వచ్చాక భారత సమాజంలో బలమైన సామాజిక మార్పుకు బాటలు పడ్డాయి అన్నారు. బి.పి.మండల్ 41వ వర్థంతిని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం స్థానిక నల్లకుంట (కూరగాయల మార్కెట్)లోని జాతీయ బీసీదళ్ నగర కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు సామాజిక వేత్తలు, కుల సంఘాల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్‌లు, బిపి మండల్ సేవలను కొనియాడారు. అంతకుముందు బిపి మండల్ చిత్రపటంకు పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్రకుమారస్వామి వ్యవహరించారు. ఈ సందర్భంగా సభలో రాష్ట్ర బీసీ కమిషన్ ఛైౖర్మన్ డా॥ వకుళాభరణం కీలకోపన్యాసం చేశారు.
డా॥ వకుళాభరణం ప్రసంగిస్తూ...రెండవ జాతీయ బీసీ కమిషన్ ఛైౖర్మన్‌గా నియామకమైన బిపి మండల్ అంకితభావంతో దేశమంతా పర్యటించి సమర్పించిన నివేదికలో చేసిన సిఫారసులు ఈ దేశ సామాజిక ప్రగతికి పరిపుష్ఠతను చేకూర్చాయని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైన వెనకకు తగ్గకుండా, నిరాశకు లోనుకాకుండా బిపి మండల్ అకుంఠితమైన దీక్షతో మండల్ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం వలననే దేశంలో విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు రిజర్వేషన్లు అమలులోకి వచ్చి ఇంతటి ప్రగతికారకమైన సమాజం నిర్మాణం జరుగుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక ఉద్యమకారులు, సంస్థలు, కుల సంఘాలు, విధిగా బిపి మండల్‌కు జయంతి, వర్థంతిలను ఘనంగా నిర్వహించడం కర్తవ్యంగా స్వీకరించాలని ఆయన సూచించారు. మండల్ కమిషన్‌లో సూచించిన అన్ని సిఫారసులను అమలులోకి తెచ్చి, బీసీల అభ్యున్నతికి ముందుకు రావాల్సిన అవసరం కేంద్రప్రభుత్వంపై
ఉందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మెజారిటి ప్రజలైన బిసిల లెక్కలను శాస్త్రీయంగా సేకరించాలని అన్నారు. అందుకు త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో కులగణనను కూడా చేయాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని కోరారు. జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు
దుండ్రకుమారస్వామి ప్రసంగిస్తూ…మండల్ సిఫారసులలోని కనీసం కులగణన, ప్రమోషన్ల రిజర్వేషన్లు ప్రత్యేక మంత్రిత్వశాఖ, సబ్‌ప్లాన్ నిధులు, ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బిపి మండల్ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికాకంగా జరిపించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రపాల్ బాబా, ప్రొఫెసర్ ఎమ్.బాగయ్య, ప్రొ॥ రవీందర్, సురేశ్‌యాదవ్, ఎన్.శ్రీనివాస్ రజక, కె.రఘుపతి ముదిరాజ్, దుర్గేష్ నేత, బన్నె దివ్యయాదవ్, భూలక్ష్మి, మాధవి, ప్రవీన్ యాదవ్, మురళికృష్ణ, సాగర్, అయ్యన్న, యాకస్వామి, వీరయ్య ముదిరాజ్, నవీన్ నేత, నోముల శ్రావన్, వీరేందర్‌గౌడ్, అంజి మహరాజ్, గాదె సమ్మయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.