బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య — దుండ్ర కుమారస్వామి హెచ్చరిక
దశాబ్దాలుగా బీసీలు స్థానిక సంస్థల్లో తమ హక్కుల కోసం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోసం సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తేల్చిందని అన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి. ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కొంతమంది పక్కా ప్రణాళికతో కుట్రలు చేయడం చాలా బాధాకరమని తెలిపారు.
సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం చేసే పోరాటం నేరమా అని తీవ్రంగా విమర్శించారు.
“దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న బీసీలకు ఇప్పుడు అవకాశాలు సాకారం అవుతున్నాయి, సామాజిక న్యాయం సమీపిస్తోంది. ఆ అవకాశాన్ని దూరం చేయడానికి, మా ఆశయాన్ని అడ్డుకోవడానికి కొందరు మళ్లీ కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటివారికి ప్రజాస్వామ్యంలో తగిన మూల్యం చెల్లించాల్సిందే. ఈ వ్యూహాలు ఆగకపోతే రాబోయే రోజుల్లో ఓటుతో బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది” అని ఆయన హెచ్చరించారు.
రాజ్యాంగపరంగా మరియు సామాజిక న్యాయపరంగా జనాభా దామాషా ఆధారంగా రిజర్వేషన్లు అవసరం అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో కూడా రిజర్వేషన్లు 50%కి పైగా ఉన్నట్టు ఉదాహరణగా చూపిస్తూ, “అక్కడ న్యాయం జరిగితే ఇక్కడ ఎందుకు జరగకూడదు? బీసీలను అనగదొక్కే కుట్ర జరుగుతోంది. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం” అని స్పష్టం చేశారు.
“ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే విధంగా, రిజర్వేషన్లను నిరోధించే ప్రయత్నాలు బీసీల అభ్యున్నతికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలే. ఇది కేవలం చట్టపరమైన పోరాటం కాకుండా, సామాజిక న్యాయం కోసం చేస్తున్న బీసీల ధర్మయుద్ధం. బీసీల హక్కులను కాలరాయడం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం మాత్రమే వారి లక్ష్యం” అని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్లనుఅ అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారని, వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.
“వారిని ప్రజలు ఓటుతో శిక్షించే రోజు దూరంలో లేదు” అని సూచించారు.