తెలంగాణ: బ్లాక్ ఫంగస్ అంటేనే వెన్నులో వణుకు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, అసలు ఈ బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుంది అనే దానిమీద అధ్యయనం మొదలైంది.. డయాబెటిస్ ఉన్నవారికి కరోనా వచ్చి, తగ్గిన వారికి మాత్రమే ఇది వస్తుంది అని ఒకింత ప్రచారం జరిగిన నేపద్యంలో.. కరోనా రానివారికి కూడా బ్లాక్ ఫంగస్ సోకుతుండటంతో డాక్టర్లు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. అందులో భాగంగా ఐఎంఏ డాక్టర్లు దీని మీద కొత్తగా ఒక వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. కరోనా వ్యాధికి వాడుతున్న జింక్, ఐరన్ మందుల వల్ల కూడా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంది అని బలంగా చెప్తున్నారు. దీనితోపాటు మరో వాదన కూడా వినిపిస్తోంది.
ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలెండర్ల ద్వారానే బ్లాక్ ఫంగస్ సోకుతుందని కొందరు ముంబై డాక్టర్లు చెబుతున్నారు. నాణ్యతలేని ఆక్సిజన్ సిలెండర్ల ద్వారా బ్లాక్ ఫంగస్ సోకుతుందని బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి స్కల్ న్యూరో సర్జన్ డాక్టర్ సంపత్ చంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అసుపత్రి ఐసీయూలో వుండే నాసిరకం పైపుల వల్ల కూడ వివిధ ఫంగస్‌లు సోకే ప్రమాదం ఉందని కూడా అనుమానం వ్యక్తంచేశారు. ఆక్సిజన్ అందించేప్పుడు ఫ్లో మీటర్ లో ఉపయోగించే నీరు దీనికి కారణం కావచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తంచేస్తున్నారు.
మెడికల్ ఆక్సిజన్‌కు, ఇండస్ట్రియల్ ఆక్సిజన్‌కు తేడా..
మెడికల్ ఆక్సిజన్‌కు లైఫ్ సేవింగ్ లక్షణాలు ఎక్కువ. మెడికల్ ఆక్సిజన్‌లో ఫంగస్ లేకుండా వివిధ చోట్ల ఫిల్టర్ చేస్తారు. అయితే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారీకి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోరు. శుభ్ర పరచని సిలెండర్ల నుంచి సరఫరా అయ్యే ఈ ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా..అందులోని మలినాలు కూడా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం పాలు చేసే అవకాశముంది. ఒక్కోసారి వాటిలో కలుషిత నీటిని వాడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆక్సిజన్ సిలెండర్లను పరిశుభ్రంగా కడగక పోవటం ద్వారా కూడా ఫంగస్ సోకే ప్రమాదం ఉందని ముంబై డాక్లర్ల అంచనావేస్తున్నారు. సిలిండర్లను ఖాళీ చేసి, పూర్తిగా శుభ్రం చేసి, తగిన విధంగా లేబుల్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా మెడికల్-గ్రేడ్ ఆక్సిజన్ ఉపయోగించకూడదని డాక్టర్లు చెబుతున్నారు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలెండర్ల ను రవాణా చేసే సమయంలో లీక్ అవుతుంటాయి..దీని వల్ల వాటిలో బ్యాక్టీరియా చేరే అవకాశాలుంటాయని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.