వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి పెద్ద షాకే తగిలింది.
ప్రతిపక్షాలన్నీ ఏకమైన వేళ ఉప ఎన్నికల్లో తమ పరాజయ పరంపరను కొనసాగించింది. దేశవ్యాప్తంగా మొత్తం 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. అందులో 12 స్థానాల్లో ఓటమి పాలైంది. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ లోక్‌సభ స్థానం, నాగాలాండ్ లోక్‌సభ (ఎన్‌డీపీపీతో పొత్తు), ఉత్తరాఖండ్‌లోని తరాలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక కైరానా లోక్‌సభ స్థానంలోనూ కమలం వాడిపోయింది. ఇక్కడ ప్రతిపక్షాలన్నీ ఏకమవడంతో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డీ)కి చెందిన అభ్యర్థి తబస్సమ్ హసన్ ఘన విజయం సాధించారు. బీజేపీకి చెందిన మృగాంక సింగ్‌పై ఆమె గెలిచారు. యూపీ నుంచి ఎంపీ అయిన తొలి ముస్లిం మహిళగా తబస్సమ్ ఘనత సాధించడం గమనార్హం.
మహారాష్ట్రలోని పాల్‌ఘర్ సీటును నిలుపుకోవడం మాత్రమే బీజేపీకి కాస్త ఊరట కలిగించే విషయం. బీజేపీకి చెందిన రాజేంద్ర గవిట్ ఈ స్థానం నుంచి విజయం సాధించారు. అటు ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ తరాలి అసెంబ్లీ సీటును కూడా నిలుపుకుంది. బీజేపీకి చెందిన మున్నీ దేవి షా.. కాంగ్రెస్ అభ్యర్థి జీత్‌రామ్‌పై 1900 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇక జార్ఖండ్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఈ రెండింట్లోనూ ప్రధాన ప్రతిపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)నే విజయ భేరి మోగించింది. గోమియా, సిల్లి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. సిల్లిలో జేఎంఎం అభ్యర్థి సీమా మహతో.. ప్రభుత్వంలో భాగమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు సుదేశ్ మహతోపై 13508 ఓట్లతో గెలిచారు. గోమియాలో ప్రభుత్వంలో భాగమైన బీజేపీ, ఏజేఎస్‌యూ వేర్వేరుగా పోటీ చేశాయి. ఇక్కడ జేఎంఎం అభ్యర్థి బబితా దేవి 1800 ఓట్ల తేడాతో ఏజేఎస్‌యూ అభ్యర్థి లంబోదర్ మహతోపై గెలవగా.. బీజేపీ అభ్యర్థి మాదవ్‌లాల్ సింగ్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.
మహారాష్ట్రలోనే మరో లోక్‌సభ స్థానమైన భండారా-గోండియా స్థానంలో ఎన్సీపీ అభ్యర్థి చేతిలో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. మొదట్లో బీజేపీ అభ్యర్థి హేమంత్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నా.. తర్వాత వెనుకబడిపోయారు. బెంగళూరులో జరిగిన ఆర్‌ఆర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న 25 వేలకుపైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి తులసి మునిరాజు గౌడపై విజయం సాధించారు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య 79కి చేరింది. మేఘలయలో అంపాటి అసెంబ్లీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీహార్‌లోని జోకిహాట్ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి గెలవడం అధికార జేడీయూకి షాకిచ్చింది. 41 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఆర్జేడీ అభ్యర్థి షానవాజ్ ఆలమ్ విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లో మహాస్థల అసెంబ్లీ స్థానాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టుకుంది. ఇక్కడ బీజేపీ రెండు, సీపీఎం మూడు స్థానాల్లో నిలిచాయి.