ఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ హవా
రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా సాగిపోతున్న బీజేపీ మరోసారి తన విజయపరంపరను కొనసాగించింది. ఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో తన సత్తా చాటింది. త్రిపురలో తమ సైద్ధాంతిక ప్రత్యర్థి సీపీఎంను దెబ్బతీసి పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీ, నాగాలాండ్‌లో మిత్రపక్షంతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు కు పావులు కదుపుతున్నది. ఎవరికీ సంపూర్ణ మెజా రిటీ రాని మేఘాలయలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా మని చెబుతున్నది. ఇప్పటికే దేశంలోని 29 రాష్ర్టాలకు 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈశాన్యంలో సైతం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికే ఆ పార్టీ చేతిలో ఉండగా, తాజాగా త్రిపుర, నాగాలాండ్‌తోపాటు మే ఘాలయ కూడా దాని ఖాతాలో చేరనున్నట్టు తెలుస్తున్న ది.అధికారంలో ఉన్న ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత, ప్రాంతీయ పక్షాలతో పొత్తులు బీజేపీకి అనూహ్య ఫలితాలను తెచ్చిపెట్టాయి. త్రిపుర, నాగా లాండ్‌లో కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా లభించలేదు.
‘‘త్రిపుర ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి’’.. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు సీపీఎం నేత సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలివి! శనివారం వెలువడిన ఫలితాలతో ఆయన మాటలు నిజమేననిపిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమల్లోకి తీసుకురావడం వంటి పలు నిర్ణయాలతో దేశవ్యాప్తంగా కొంత వ్యతిరేకత ఉందని.. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘ఇది మార్పునకు సంకేతం’ అనీ పేర్కొన్నారు. అయితే తాజాగా మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో జరగ్గా.. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది.