ఆమె ఓ మహిళ… మగవాడి వేషం ధరించి ముగ్గురు యువతులను ఒకరికి తెలియకుండా వేరొకరిని మనువాడింది.
చివరికి విషయం బయటపడి జమ్మలమడుగు పోలీసులకు చిక్కింది. పోలీసులు అందించిన వివరాల మేరకు… కడప జిల్లా కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన రమాదేవి (18) తమిళనాడు రాష్ట్రంలోని రోహిణి కాటన్ మిల్లులో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఆమె పురుషుడి వేషంలో ఉంటూ, పూర్తి స్థాయిలో మగవాడిగానే వ్యవహరించింది. ఇలా ఆమె ముగ్గురు యువతులను వివాహమాడింది.
చివరిగా ఆమె ఇటీవల వివాహం చేసుకున్న పెద్దముడియం మండలానికి చెందిన యువతి ద్వారా పోలీసులకు చిక్కింది. తొలుత ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన బుజ్జి (17) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది. రెండవది అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం కొత్తచెరువు గ్రామానికి చెందిన వందన (18) అనే అమ్మాయిని వివాహం ఆడింది. రెండు నెలల క్రితం కడప జిల్లా పెద్దముడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన గడ్డం మౌనిక (18) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఈ వివాహం విషయం వారి ఇంట్లో వారికి కూడా తెలియకపోవడం విశేషం.
వివాహం అయిన తర్వాత తనకు సెలవులు లేవని, ఉద్యోగ విధులకు వెళ్లాలని త్వరలో తమిళనాడులోనే సంసారం పెడతానని ఆ ముగ్గురు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి మోసగించింది. ఇంకొకరిని పెళ్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నదని పోలీసులు తెలిపారు. పులివెందుల వద్ద ఓ కాటన్ మిల్లులో పనిచేస్తున్న మౌనిక క్రిస్మస్ పండుగకు పుట్టింటికి భీమగుండం గ్రామానికి చేరింది. రమాదేవి మంగళవారం భీమగుండం గ్రామానికి వెళ్లి తన వెంట రావాలని మౌనికను కోరింది. నీవెవరని కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించినపుడు మౌనికను తాను పెళ్లి చేసుకున్నానని వాదించిందని పోలీసులు తెలిపారు. ఆమె అలా చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.
రమాదేవితో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మౌనిక అక్కడక్కడా తిరుగుతూ తొలిసారిగానే పుట్టింటికి వచ్చింది. ఇంటిలో కూడా తామిద్దం పెళ్లి చేసుకున్నామన్న సమాచారం తెలిపింది. కుటుంబ సభ్యులు కట్టిన తాళిని తెంచి జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయానికి ఆ ఇద్దరిని పిలుచుకుని వచ్చారు. జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయంలో రమాదేవి బాగోతం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. భీమగుండం గ్రామానికి చెందిన మౌనికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఈ వ్యవహారాన్ని త్వరలో ఛేదిస్తామని డీఎస్పీ కోలా కృష్ణన్ విలేకరులకు తెలిపారు.