ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు
దంతేవాడ- బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దులోని మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమేనార్ అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వు గార్డు (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు.
జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. సుమారు గంట పాటు ఇరువర్గాల మధ్య భీకరపోరు జరిగింది. భద్రతా బలగాల ధాటికి తాళలేక మావోయిస్టులు అటవీప్రాంతంలోకి పరారయ్యారు. కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ఘటన స్థలంలో ఎనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. రెండు రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు, ఒక 12బోర్ రైఫిల్, టెంట్ సామగ్రి, నిత్యావసర సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.