లోక్ సభ ఎన్నికల ముందే కులగణన సర్వేకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి..!
*కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం శుభసూచికం. కాలయాపన చేయకుండా కుల సర్వేకు ప్రభుత్వం జీవో ఇవ్వాలి*
*లోక్ సభకు ఎన్నికల నోటిఫికేషన్.. కుల సర్వేకు అవరోధం*
సామాజిక ఆర్థిక కులసర్వే అసెంబ్లీలో ఏక తీర్మానం ఆమోదించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నిర్దిష్టమైన ఉత్తర్వులను జారీ చేయకపోవడం పట్ల బీసీ సంఘాలు, నిరాశకు గురి అవుతున్నాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధి పై ఎలాంటి అప నమ్మకం లేదని.. కానీ ఆలస్యం అవుతుండడం వల్ల కులసర్వే ప్రక్రియ ఆరంభానికి బ్రేక్ పడే ప్రమాదం ఉందని అన్నారు.త్వరలో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే వీలున్నందున కుల సర్వేకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉత్తర్వుల రూపంలో వెంటనే జారీ చేయాలని కుమార స్వామి కోరారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసి, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం వలన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ వివిధ ప్రభుత్వ విభాగాలు, కుల సర్వేకు సంబంధించిన పనిని పూర్తి చేయడంలో నిమగ్నం అవుతాయని సూచించారు.కుల సర్వే ఆరంభంలో, క్షేత్రస్థాయిలో పర్యటనలు, ఇంటింటి సమాచార సేకరణ, లాంటి ప్రధానమైన కార్యక్రమాలు వెంటనే ఆరంభించడం వలన లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈ ప్రక్రియకు ఏమాత్రం అడ్డంకిగా నిలువబోదని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు..