(తొలిపలుకు న్యూస్) : మీకు ఎవరైనా ఫోన్ చేసి మేము ఆరోగ్య శాఖ హెడ్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాం , మీ యొక్క హెల్త్ కార్డ్ పై ప్రభుత్వం వారు డబ్బును మంజూరు చేశారు అంటూ ఎవరైనా ఫోన్ చేశారా! మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త.
సైబర్ నేరగాళ్లు ఈ విధంగా తాము హెల్త్ డిపార్ట్‌మెంట్ వారమని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు, ఇటువంటి నేరాలలో మొదటగా సైబర్ నేరగాళ్లు తాము ఆరోగ్య శాఖ వారమని ఫోన్ చేసి , ప్రభుత్వం వారు మీ యొక్క హెల్త్ కార్డ్ పై డబ్బును మంజూరు చేశారు , మీకు ఆ డబ్బును ఫోన్ పే నందు జమ చేస్తాం , కావున మీ యొక్క ఫోన్ పే ను ఓపెన్ చేయమని చెబుతారు, ఆ మాటలను నమ్మి మీరు మీ యొక్క ఫోన్ పే ను ఒపెన్ చేస్తారు, ఆ తర్వాత మేము చెప్పినట్లు చేయండి. మీ ఖాతా నందు డబ్బు జమ అవుతుంది అని చెబుతారు , ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్ టు బ్యాంక్ అకౌంట్/UPI ID పై క్లిక్ చేయమని చెబుతారు .
UPI ID ఉన్న చోట మీకు ఫోన్ చేసిన మా యొక్క మొబైల్ నెంబర్ ను అక్కడ ఎంటర్ చేయమని చెబుతారు, ఆ మాటలను నమ్మి మీరు వారి మొబైలు నెంబర్ ను ఎంటర్ చేయగా ఫోన్ నెంబర్ తర్వాత @UPI అని టైపు చేయమని చెబుతారు. అక్కడ verify అనే ఆప్షన్ పై క్లిక్ చేయమని చెబుతారు , వారి మాటలని నమ్మి వారు చెప్పిన విధంగా మీరు ఆ నెంబర్ ను ఎంటర్ చేసి verify అని కొట్టగానే అక్కడ హెల్త్ డిపార్ట్‌మెంట్ అనే పేరు చూపిస్తుంది. దానిని నమ్మిన తర్వాత ఎంటర్ అమౌంట్ అని చూపిస్తుంది , అక్కడ వారు ప్రభుత్వం మీకు ఇన్ని వేల రూపాయలను మంజూరు చేసింది అని చెప్పి అక్కడ వారు చెప్పే అమౌంట్ ఎంటర్ చేయమని చెబుతారు, అలా ఎంటర్ చేయగానే మీకు మీ యొక్క UPI పిన్ ను ఎంటర్ చేయమని చూపిస్తుంది, అక్కడ మీ యొక్క పిన్ ఎంటర్ చేయగానే మీ ఖాతా ఖాళీ అవుతుంది ,
ఈ విధంగా సైబర్ నేరగాళ్లు ఆరోగ్య శాఖ పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు కావున జాగ్రత్త వహించండి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
- ఈ విధంగా మీకు ఎవరైనా ఫోన్ చేసిన ఎడల వారిని నమ్మకండి.
- ఏ ప్రభుత్వ శాఖ వారు కూడా మీకు డైరెక్ట్ గా ఫోన్ చేయరు , మీకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందాలన్న సంబంధిత శాఖ యొక్క ఆఫీసు నందు పొందగలరే కానీ ఈ విధంగా ఫోన్ ద్వారా అందించరు .
- మీలో ఎవరైనా ఈ విధంగా మోసపోయినట్లయితే మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ నందు కానీ లేక సైబర్ క్రైమ్ వారికి కానీ ఫిర్యాదు చేయండి.
ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయoడి.