- అంబర్ పేట్ అక్రమ వసూళ్లు మీద ధ్వజమెత్తిన దుండ్ర కుమారస్వామి..
- అంబర్ పేట్ స్మశాన వాటిక సిబ్బంది అక్రమ వసూళ్లపై రాష్ట్ర “బిసి దళ్” అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఫైర్..
- తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే అధిక మొత్తంలో అడ్డగోలుగా వసూలు చెయ్యడం అన్యాయం అంటున్న కుమారస్వామి..
అంబర్ పెట్ : కరోనా మహమ్మారి కరాళ నృత్యం అయితే కొందరికి బాగా కలిసొచ్చింది. పొద్దున లేచినప్పటి నుండి పడుకునే దాకా ప్రతీ నిత్యావసర వస్తువులు మొదలుకొని కాటికి పోయెదాకా, అమాంతం అన్నింటికీ రేట్లు పెంచేసి, కరోనా కష్టాల్లో ఉన్న పేద ప్రజలను దొరికినోడు దొరికినంత అడ్డగోలుగా దోచుకోవడం మొదలుపెట్టారు..
అందులో భాగంగానే అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్లోని హిందూ స్మశాన వాటికలో, కరోనాతో చనిపోయిన వారిని పూడ్చిపెట్టడానికి అయ్యే ఖర్చులు చూస్తే, పట్టపగలే చుక్కలు కనిపించేంత కనికరం లేకుండా వసూలు చేస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి…
అంబర్ పేట్ స్థానిక ప్రజలు ఈ అక్రమ వసూళ్ల బాగోతాన్ని రాష్ట్ర “బిసి దళ్” అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి దృష్టికి తీసుకొచ్చారు.
కరోనా తో చనిపోయిన వారి కుటుంబాల దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువగా
రూ: 20,000/- నుంచి రూ: 30,000/- వేలు,
అదేవిధంగా బొందలు పెడితే రూ: 60,000/- నుంచి
లక్ష రూపాయల దాకా వసూళ్లకు పాల్పడుతున్నారన్నారని అక్కడి స్థానికులు కుమారస్వామి తో ఆవేదన వ్యక్తం చేశారు..
డోనర్స్ ఇచ్చిన రథాలకు రూ: 2800/- నుంచి 3500/-వరకు ఇష్టానుసారంగా డబ్బులు వసూలకు పాల్పడుతున్నారని…. ఈకరోనా కష్టకాలంలో కుటుంబంలో కన్నవాళ్ళని, కావలసిన వాళ్ళని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాలాంటి పేదల దగ్గర ఈ విధంగా అధిక మొత్తంలో అక్రమంగా వసూలు చేయడం మంచిది కాదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ వసూళ్లపై ఇక్కడి స్థానికి ప్రజలందరం, సంబంధిత నాయకులకు ఫిర్యాదు చేసినా కూడా, నాయకులు నిమ్మకు నీరెత్తనట్లుగానే వ్యవహరిస్తున్నారు కానీ ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు అని తెలిపారు..
ఇప్పటికైనా అంబర్ పేట్ నియోజకవర్గ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు వెంటనే స్పందించి, ఇలాంటి అక్రమ వసూళ్లు ఆగిపోయేలాగా చర్యలు తీసుకోవాలని అంబర్ పెట్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..