కరోనా మహమ్మారి కారణంగా కుల వృత్తి దారులు మరియు చేతి వృత్తి దారులు తీవ్రంగా నష్టపోయారని, ఒక్క పూట కూటికి కూడా కరువైన పేదల కడగండ్లు స్పష్టంగా కానవస్తున్నాయి, ఇవన్నీ కరోనా కాలపు కుల వృత్తుల కడగండ్లు అని తెలంగాణ బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తులను నమ్ముకొని తరతరాలుగా వీరు జీవనం కొనసాగిస్తున్నారు, అకస్మాత్తుగా వచ్చిన కరోనా కారణంగా విలవిలలాడుతున్నారు. వృత్తిని నమ్ముకొని ఇన్నాళ్లు బతికిన వాళ్ళు ఇప్పుడు ఉపాధి లేక ఆకలితో ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారులకు కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారికి రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కుమారస్వామి కోరారు. కరోనా అన్లాక్ ప్రక్రియ తరువాత కొన్ని కులవృత్తులు పాక్షికంగా మరియు కొన్ని పూర్తిగా తెరుచుకున్న ప్పటికీ మొదటి లాగా వ్యాపారాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కులవృత్తులు చేస్తున్నవారు తగు జాగ్రత్తలతో ముఖ్యంగా మాస్క్, శానిటైజర్ సామాజిక దూరం వంటి జాగ్రత్తలు పాటిస్తూ తమ వ్యాపారాలు, విధులు కొనసాగించాలని కుమారస్వామి వృత్తిదారులు విన్నవించారు.
.
.