దేశాభివృద్ధిలో ఈశాన్య ప్రగతి కీలకం
అసోం ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న తొలి గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును ప్రధాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతంలో శరవేగంగా సమతుల్యతతో కూడిన వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తూర్పు దేశాలకు సంబంధించిన మన విదేశాంగ విధానానికి (యాక్ట్ ఈస్ట్ పాలసీ) ఈశాన్య ప్రాంతం గుండెకాయ వంటిది. ఆగ్నేయాసియా దేశాలు, ఈశాన్య భారత ప్రాంత ప్రజల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు పెరుగాల్సిన అవసరం ఉన్నది. సదస్సు ఉప శీర్షిక ఆసియాన్‌కు ఎక్స్‌ప్రెస్ రహదారి అసోం అనేది ఒక నినాదం మాత్రమే కాదు. అది ఒక సమగ్ర మార్గదర్శక ప్రణాళిక. సులభ వాణిజ్య విధానం అమలులో ఈశాన్య రాష్ర్టాల్లో అసోం ప్రథమ స్థానంలో ఉన్నది.
కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం పని సంస్కృతిలో మార్పు తీసుకొచ్చింది. మా ప్రభుత్వ విధానాలతోనే ద్రవ్యోల్బణం ఐదు శాతం లోపే స్థిర పడింది. వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐల రాకకు మార్గం సుగమమైంది అని ఆయన చెప్పారు. మా విధానాల వల్లే భారత్ పెట్టుబడులకు ప్రాధాన్య దేశంగా అవతరించింది. అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది 9000 కి.మీలకు పైగా జాతీయ రహదారుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షేరింగ్ తొబాగె, అసోం సీఎం శర్బానంద సోనోవాల్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు,16 దేశాల రాయబారులు, హై కమిషనర్లు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, టాటాసన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.