స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి
హైదరాబాద్, 2024 జనవరి 05: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి శ్రీమతి సితక్కని కలిసి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 23% నుండి 42% కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జడ్పీలలో బీసీల రిజర్వేషన్లు కేవలం 23% మాత్రమే ఉన్నాయని, దీనివలన రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కడం లేదని దుండ్ర కుమార స్వామి మంత్రికి తెలిపారు. కామరెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా రెజర్వేషన్లు పెంచాలని కోరారు.బీసీ సామాజిక వర్గానికి రాష్ట్ర జనాభాలో గణనీయమైన ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో వారికి స్థానిక పాలనలో సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకోసం రిజర్వేషన్ల శాతం పెంచడం తప్ప వేరే మార్గం లేదని దుండ్ర కుమార స్వామి తెలిపారు. రిజర్వేషన్ల పెంపుతో బీసీ సామాజిక వర్గంలోని వివిధ అట్టడుగు వర్గాలకు కూడా రాజకీయ అవకాశాలు లభిస్తాయని, ఇది రాష్ట్రంలో సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి సితక్క, దుండ్ర కుమార స్వామి డిమాండ్‌ను పరిశీలిస్తానని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 42% రిజర్వేషన్లు అమలు చేయడం మరియు బీసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యం పెంచడం తప్ప వేరే మార్గం లేదని బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి తెలిపారు.