అమరావతిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించి స్పైక్ టవర్ డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఈ డిజైన్‌కు ఆమోదం తెలిపారు. ఇదే అత్యుత్తమమైనదని మంత్రిమండలి తీర్మానించింది. ఈ ఆకృతిలోనే తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు కనిపించేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎక్కడెక్కడ ఎలాంటి అంశాలు మేళవించాలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు మంత్రి నారాయణ విలేకరుకు తెలిపారు. సినిమా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సూచనలను కూడా తీసుకొని వాటిని ఇందులో జోడించనున్నట్లు వివరించారు.
టవర్ నిర్మాణంలో భాగంగా నాలుగు అంతస్తుల తర్వాత గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ నుంచి రాజధాని ప్రాంతం మొత్తాన్ని వీక్షించవచ్చు. 75 మంది నిల్చునేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. అక్కడ నుంచి టవర్ లోపల, బయట వచ్చేలా సోలార్ పలకలను అమర్చి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. దీన్ని అసెంబ్లీ భవన సముదాయానికి వినియోగిస్తారు. నిర్మాణంలో భాగంగా స్ట్రక్చరల్ డిజైన్స్, సామగ్రికి సంబంధించి పూర్తి వివరాల రావడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని మంత్రి నారాయణ చెప్పారు. ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.