సెర్చ్ ఇంజన్ల తరహాలో ప్రభుత్వ పాలన
అలెక్సా, గూగుల్ వంటి సాంకేతిక సంస్థల తరహాలోనే తమ ప్రభుత్వాన్ని నడుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సెర్చ్ ఇంజన్ల తరహాలో ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారం అడిగినా ప్రజలకు క్షణాల్లో సమాచారం అందించనున్నామని చెప్పారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా జరిగిన ప్లీనరీలో ప్రభుత్వం మరో నూతన సాంకేతికతను పరిచయం చేసింది. మాటల రూపంలో వేసే ప్రశ్నలకు మాటల్లోనే సమాచారం అందించే విధానాన్ని ప్రదర్శించింది. సీఐఐ సదస్సులో ‘రేపటి సాంకేతికతలు’ అనే అంశంపై జరిగిన ప్లీనరీలో ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్ అందించారు. ప్రభుత్వ రియల్ టైమ్ గవర్నెన్స్ సాంకేతిక భాగస్వామి అలెక్సా ఈ విధానాన్ని రూపొందించింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదని చెప్పారు. ఆధార్ కార్డ్ తరహాలో ప్రతి భూమికి భూధార్ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని చెప్పారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని ఆన్‌లైన్ ద్వారా అనుసంధానిస్తామన్నారు.
నవ కల్పనలపై దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు తమ ఆవిష్కరణల గురించి ఈ ప్లీనరీలో వివరించారు. రాష్ట్రంలోని గృహోపకరణాలకు విద్యుత్ ఆదా చేసే పరికరాలను అమర్చడం ద్వారా కోట్ల రూపాయలను ఆదా చేయొచ్చని అటంబర్గ్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు సిబబ్రత దాస్, మొక్కల నుంచి విద్యుత్‌ను అందించే విధానంపై నెదర్లాండ్స్ కు చెందిన ప్లాంట్ ఈ సీఈవో మార్జోలిన్ హెల్డర్, విద్యా సంబంధ విషయాల్లో సహకారం అందించడంపై ఫిన్లాండ్‌కు చెందిన పీటర్ వెస్టర్ బెకా తదితరులు తమ ఆవిష్కరణలను ప్రజెంట్ చేశారు.
నగరాల్లో నవీకరణ సాంకేతికతలు అందించే కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడం కోసం ఏస్ అర్బన్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏస్ అర్బన్ విశాఖలో 3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.