12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చ జెండా 15న నోటిఫికేషన్ జారీ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షల నిర్వహణ పెంచిన 42 ఏళ్ల వయోపరిమితి వర్తింపు డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించిన మంత్రి గంటా ఈసారి ఏపీపీఎస్సీకి అప్పగించే యోచననిరుదోగ్య యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు చేపట్టింది. భారీ డీఎస్సీ నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 12,370 ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)-2018 నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. ఇక్కడ సచివాలయంలో బుధవారం మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల రోజునే డీఎస్సీ, టెట్ నిర్వహించాల్సి వస్తే షెడ్యూల్‌లో కొంత మార్పు చేసే అవకాశం ఉంది. గత 2014లో 8,926 పోస్టులు భర్తీ చేయగా.. ఈసారి పోస్టుల సంఖ్య 12,370గా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వయోపరిమితి 42ఏళ్లు ఉపాధ్యాయుల భర్తీకి వర్తించనుంది. ఇప్పటి వరకు ఉపాధ్యాయ ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తుండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ ఛైర్మన్‌తో చర్చించారు. ముఖ్యమంత్రితో మరోమారు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
టెట్ పరీక్ష ఆన్‌లైన్‌లో..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను మొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో పరీక్ష నిర్వహించనున్నారు. టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించనున్నారు. సాంఘిక సంక్షేమ, ఐటీడీఏలాంటి వాటిల్లో ఉపాధ్యాయుల భర్తీకి టెట్ అవసరం అవుతున్నందున ఈసారి టెట్‌ను ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో టెట్ రాసి అర్హత సాధించిన వారికి ఏడేళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. ఒకవేళ మళ్లీ టెట్ రాసినా రెండింటిలో ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
షెడ్యూల్ ఇలా..
* సిలబస్‌తో కలిపి డీఎస్సీ నోటిఫికేషన్: ఈనెల 15న.
* రుసుముల చెల్లింపు: ఏపీ ఆన్‌లైన్, మీ-సేవ, ఈ-సేవ ద్వారా డిసెంబరు 26 – ఫిబ్రవరి 7 మధ్య.
* ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ: డిసెంబరు 26 నుంచి ఫిబ్రవరి 8 వరకు.
* హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: మార్చి 9న.
* రాత పరీక్ష: మార్చి 23, 24, 26.
* ప్రాథమిక ‘కీ’ విడుదల: ఏప్రిల్ 9న.
* ప్రాథమిక ‘కీ’పై ఆన్‌లైన్ అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్ 10 నుంచి 16 వరకు.
* తుది ‘కీ’ విడుదల: ఏప్రిల్ 30న.
* మెరిట్ లిస్టు ప్రకటన: మే 5న.
* ఎంపికైన విద్యార్థుల జాబితా, అభ్యర్థులకు సమాచారం: మే 11న.
* జిల్లా స్థాయిలో ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన: మే 14 నుంచి 19 వరకు.
* వైద్య ధ్రువీకరణల(సర్టిఫికెట్ల) అందచేత: మే 31న.
* డీఎస్సీ తుది ఎంపిక జాబితా: జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు.
* కౌన్సెలింగ్ ద్వారా నియామక ఉత్తర్వులు: జూన్ 8 నుంచి 11వ తేదీ వరకు.
పోస్టులు ఇలా..
పాఠశాల సహాయకులు(ఎస్‌ఏ), ఎస్జీటీ, భాషాపండితులు,
పీఈటీ పోస్టులు: 10,313
ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు: 860 ఆదర్శ(మోడల్) పాఠశాలల్లో
పోస్టులు: 1,197
ఈ పోస్టుల్లోనే 3,407 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది.