ఒడిశా రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన అనుప్రియా లక్రా అనే 23 ఏళ్ల గిరిజన యువతి మొట్టమొదటి మహిళా పైలట్ గా ఎంపికై తన కలను సాకారం చేసుకున్నారు.మల్కాన్‌గిరి జిల్లా సేమిలిగూడ గ్రామానికి చెందిన మరినియాస్ లక్రా, జమజ్ యాస్మీన్ దంపతుల కుమార్తె అయిన అనుప్రియా మెట్రిక్యులేషన్ దాకా మల్కన్ గిరి కాన్వెంట్ లో చదివింది. మరినియాస్ ఒడిశా పోలీసు హవల్దార్. అనుప్రియ పైలట్ అవ్వాలని లక్ష్యం పెట్టుకుంది. భువనేశ్వర్ లో ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలో చదువు వదిలివేసిన అనుప్రియా పైలెట్ ట్రైనింగ్ సెంటరులో చేరింది. ఏడేళ్ల పాటు అనుప్రియా పైలట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్ లో కోపైలెట్ ఉద్యోగం సాధించింది.
పైలట్ కావాలనే తన కలను నిజం చేసుకొని తమ ప్రాంత గిరిజనులకు స్ఫూర్తిగా నిలిచానని అనుప్రియా చెప్పారు. అనుప్రియా పట్టుదల, అంకితభావంతో చేసిన కృషి వల్లనే పైలట్ అయిందని సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారు. పైలట్ గా అనుప్రియా మరిన్ని విజయాలు సాధించాలని సీఎం నవీన్ ఆకాంక్షించారు.