63 ఏళ్ళ ఏంజెలా మెర్కెల్ మరోసారి జర్మన్ ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు.
దీంతో మెర్కెల్ నాలుగోసారి ఆ దేశానికి నాయకత్వం వహించబోతున్నారు. పార్లమెంటులోని దిగువ సభలో బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఆమెకు అనుకూలంగా 364 ఓట్లు, వ్యతిరేకంగా 315 ఓట్లు లభించాయి. 9 మంది సభ్యులు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. విజయం అనంతరం మెర్కెల్ మాట్లాడుతూ దేశానికి నాల్గోసారి నాయకత్వం వహించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
2005లో తొలిసారి ఛాన్స్‌లర్‌గా పదవిలోకి వచ్చిన మెర్కెల్ జర్మనీ రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగించారు. ఆర్థిక సంక్షోభం నుంచి యూరోపియన్ యూనియన్‌ను బయటపడేయడంలో ఆమె ఎనలేని కృషి చేశారు. కానీ, 2015లో దేశంలోకి వలసలను అనుమతించడానికి ఆమె తీసుకున్న కీలక నిర్ణయంతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. దాదాపు 10లక్షల మందికి పైగా శరణార్థులు దేశంలోకి వలస వచ్చారు. ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వానికి ఆమె నాయకత్వం వహించాల్సి వస్తుంది. ఆమె నాయకత్వం వహిస్తున్న కూటమిలో కొంతమంది వలసలను అనుమతించడానికి వ్యతిరేకంగా ఉన్నారు. మున్ముందు ఆమెకు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి. మద్దతు తెలుపుతున్న పార్టీల డిమాండ్లకు అనుగుణంగా ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.