మధ్యప్రాచ్యంలో మళ్లీ అశాంతి ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత మూడు దశాబ్దాలకు పైగా ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతి చర్చల్లో ప్రధాన పాత్ర పోషించిన అమెరికా దీనికి కారణమవుతుండటం గమనార్హం. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ సిద్ధమవుతున్న నేపథ్యంలో అరబ్‌ప్రపంచంలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్ నుంచి అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని ట్రంప్ నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై ఆయన అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
జెరూసలెం కీలకం ఎందుకంటే?
జెరూసలెం ఇస్లాం, క్రైస్తవం, యూదుమతాలకు పవిత్రస్థలంగా శతాబ్దాల నుంచి వుంది. 1948లో బ్రిటిషువారు వెళ్లిన అనంతరం జెరూసలెంపై అరబ్బులకు, యూదులకు మధ్య వివాదం ఏర్పడింది. నగరంలోని పశ్చిమప్రాంతాన్ని ఇజ్రాయెల్, తూర్పు ప్రాంతాన్ని అరబ్బులు స్వాధీనం చేసుకున్నారు. 1967లో జరిగిన యుద్ధంలో తూర్పుప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడంతో అశాంతికి కారణమైంది. వాస్తవానికి పాలస్తీనా ప్రజలు తూర్పు ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ వారికి ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కులేదు. 3 వేల సంవత్సరాల నుంచి యూదులకు ఈ నగరం రాజధానిగా ఉందని ఇజ్రాయెల్ వాదన, అయితే భవిష్యత్తులో ఏర్పడే పాలస్తీనా దేశానికి అరబ్బులు ఎక్కువగా ఉన్న నగరంలోని తూర్పు ప్రాంతం రాజధానిగా ఉండాలన్నది పాలస్తీనా అభిప్రాయం. దీంతో ఈ నగరం రెండు జాతుల మధ్య ఘర్షణకు కేంద్రంగా మారింది.