మీడియా స్వేచ్ఛను సైతం హరిస్తున్న ఎమ్మెల్యే?
——బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆరోపణ
నిర్వేన్ ఘటనపై హెచ్చార్సీలో ఫిర్యాదు
ప్రోటోకాల్ విషయమై ప్రశ్నించిన నిర్వేన్ గ్రామ సర్పంచిపై జులుం ప్రదర్శించి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేసిన కొత్తకోట పోలీసు అధికారులపై వారికి ఆదేశాలిచ్చిన దేవరకద్ర ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.
ఈమేరకు గురువారం బాధిత సర్పంచ్ మారెన్నగారి విశ్వనాథం గారితో కలిసి కమిషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామంలో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేశారని, ఎమ్మెల్యే మాత్రం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పింఛన్ల పంపిణీ చేస్తుండటంతో ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలాగా ఎలా నిర్వహిస్తారని దేవరకద్ర ఎమ్మెల్యే నిరంకుశ వైఖరిని ప్రశ్నించినందుకు సర్పంచిని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కొత్తకోట పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు.
సర్పంచ్ తో పాటు ఈ విషయం కవరేజీ చేసేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను కూడా అవమానించారనని, మీడియా స్వేచ్ఛను సైతం హరిస్తున్నారని మండిపడ్డారు.
ఈసందర్భంగా నిర్వేన్ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామానికి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే తనపై దౌర్జన్యం చేశారని, తన హక్కులకు భంగం కలిగించటమే కాక సర్పంచ్ గా తన విధులను అడ్డుకుని, పోలీసుల చేత అక్రమంగా తనను అరెస్టు చేయించాడని, అడ్డుకున్న తన కుటుంబ సభ్యులపై లాఠీచార్జి చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈఘటనకు బాద్యులైన ఎమ్మెల్యే ఎస్ ఐ , ఎంపిడివో లపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరారు.
జర్నలిస్ట్ మురళి సైతం తన హక్కులకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.