సిడ్నీ : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలం దృష్ట్యా తాజాగా ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే దేశ పౌరులపై బ్యాన్ విధించింది. ఇండియాలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల పాటు జైలుశిక్ష, భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
మే 3 నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తోందని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ వెల్లడించారు. “ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితులు ఇక్కడి ప్రజలు, భారతీయ ఆస్ట్రేలియన్ల హృదయాలను కలిచివేస్తున్నాయి. ప్రతిరోజు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడం బాధాకరం.” అని మంత్రి అన్నారు.
ప్రస్తుతం విధించిన నిషేధంపై మే 15న మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఏప్రిల్ 27 నుంచి మే 15 వరకు భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులను ఆస్ట్రేలియా తాత్కాలికంగా నిషేధించిన విషయం తెలిసిందే. ఇక కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న ఆసీస్ సర్కార్ వైరస్ వ్యాప్తి కట్టడిలో సఫలమైందనే చెప్పాలి. అక్కడ ప్రస్తుతం చాలా వరకు కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా కేవలం 30 కరోనా కేసులు మాత్రమే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 29,779 కేసులు నమోదైతే.. ఇందులో 910 మంది మరణించారు.