బయోఏషియా సదస్సు 2018
బయోఏషియా సదస్సులో భాగంగా రెండోరోజు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశమయ్యారు. నోవార్టిస్, బయోకాన్, మెర్క్, డెలాయిట్, జీఈ కంపెనీల సీఈవోలు, సీనియర్ ప్రతినిధులతో మంతనాలు జరిపారు. థాయ్‌లాండ్ వాణిజ్య ఉపమంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరల్‌తో భేటీ అయ్యారు. బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ నగరంలో నూతన యూనిట్ ప్రారంభించనున్నది. దీనితోపాటు ప్రస్తుత యూనిట్‌ను మరింత విస్తరించనున్నది. హెచ్‌ఐఐసీలో మంత్రి కేటీఆర్ శుక్రవారం బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్‌షాతో సమావేశమయ్యారు. జీనోమ్‌వ్యాలీలో బయోకాన్ నూతన ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె మంత్రికి తెలిపారు. తమ అనుబంధ కంపెనీ అయిన సింజెన్ ద్వారా ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
ఈ యూ నిట్ ద్వారా 1000 హైస్కిల్స్ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. బయోకాన్‌లోని సిబ్బందిని రెట్టింపు చేస్తామని, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అందజేస్తానని ఆమె మం త్రికి తెలిపారు. బయోకాన్ నూతన యూనిట్ ఏర్పాటును స్వాగతించిన మంత్రి కేటీఆర్.. కిరణ్ మజుందార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు విస్తరణలో ఫార్మాసిటీని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ స్టార్ట్‌అప్ ఇకోసిస్టమ్ గురించి ప్రస్తావించిన మంత్రి.. కిరణ్ మజుందార్ షా తదుపరి హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలోని 20 టాప్ స్టార్ట్‌అప్స్‌తో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో దేశంలో ఎట్టకేలకు ఉన్నత ప్రమాణాలున్న సైన్స్, ఇన్నోవేషన్ పరిశోధనలకు బీజం పడిందని కిరణ్ అభినందించారు. పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ లాంటి నాయకులను చూసినప్పుడు స్ఫూర్తి కలుగుతుందని ఆమె అన్నారు. ఇలాంటి నాయకులను బలపర్చాలనిపిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌పై కూడా కిరణ్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ భవిష్యత్తులో ఎలాం టి ఇబ్బందులు లేకుండా మరింత పురోగతి సాధించేందుకు ఆయారంగాల్లోని నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
హైదరాబాద్‌లో 30 లక్షల అడుగుల ల్యాబరేటరీ స్పేస్
జీఈ (సస్టెయినబుల్ హెల్త్‌కేర్ సొల్యూషన్) ప్రెసిడెంట్, సీఈవో టెర్రీ ట్రెసెన్హమ్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడ్ డివైసెస్ పార్క్ గురించి, టీ వర్క్స్ గురించి వివరించారు. బయోటెక్నాలజీలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నగరంలోని కంపెనీలు అందిపుచ్చుకునేందుకు గల అవకాశాలపై చర్చించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం సుమారు 30 లక్షల అడుగుల ల్యాబరేటరీ స్పేస్ ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి టెర్రీకి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జీనోమ్‌వ్యాలీలో ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేటర్‌లో జీఈ భాగస్వామి కావాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో చేపట్టిన క్యాన్సర్ డయాగ్నస్టిక్ కార్యక్రమాలను టెర్రీకి వివరించారు. త్వరలోనే జీనోమ్ వ్యాలీ పర్యటనకు వస్తానని టెర్రీ చెప్పారు. తెలంగాణ ప్రభుతం నిర్వహించే టాస్క్‌తో కలిసి హెల్త్‌కేర్ స్కిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టేందుకు జీఈ సిద్ధంగా ఉన్నదని ఆమె మంత్రి కేటీఆర్‌కు వివరించారు.