ప్రతిష్ఠాత్మక 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదాపడింది. వచ్చే నెల 3 నుంచి నాలుగు రోజుల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించతలపెట్టిన ఈ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు గురువారం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సీఏ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది ఈ నెల 27న జరుగనున్న ఐఎస్‌సీఏ సమావేశంలో నిర్ణయం తీసుకొంటామని వెల్లడించింది. వర్సిటీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమావేశాలను నిర్వహించలేమని ఓయూ వీసీ తెలిపారని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు ఐఎస్‌సీఏ ప్రకటనను ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రామచంద్రం గురువారం మీడియా సమావేశంలో ఖండించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేయాలంటూ తాము సమాచారాన్ని పంపించలేదని స్పష్టంచేశారు. సమావేశాల నిర్వహణకు తాము అన్ని విధాలా సన్నద్ధమయ్యామని, వాటిని విజయవంతం చేసేందుకు మూడునెలలుగా పలు కమిటీలు కృషి చేస్తు న్నాయని వివరించారు. ఇందుకోసం వర్సిటీ పరీక్షల తేదీలను కూడా మార్చినట్టు చెప్పారు. ఒక సమయంలో సమావేశాల ప్రారంభోత్సవాలను క్యాంపస్ వెలుపల, ఇతర కార్యక్రమాలను మొత్తం ఓయూలో నిర్వహించేందుకు అంగీకరించామని తెలిపారు. ఓయూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, జ్ఞానాన్ని ఒడిసిపట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహణకు ముందుకొ చ్చామన్నారు. వీటిని తదుపరి ఎప్పుడు నిర్వహిస్తారో ఐఎస్‌సీఏతో చర్చిస్తామని, అవి తిరిగి ఓయూలోనే నిర్వహిస్తారన్న ఆశాభావాన్ని రామచంద్రం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ కృష్ణారావు పాల్గొన్నారు.