బెంగళూరులో 10000 నకిలీ ఓటర్ కార్డులు స్వాధీనం
ప్రభుత్వ అధికారులతో సంబంధం లేకుండా అంతర్జాలం ఆధారంగా వేలకొద్దీ కొత్త ఓటర్లను జొప్పించే వ్యవస్థ గుట్టును మంగళవారం అర్థరాత్రి రట్టు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సంజీవ్‌కుమార్ అత్యవసర విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నగరవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 6.03 శాతం కొత్త ఓటర్లు నమోదవగా… రాజరాజేశ్వరినగర్‌లో అది 10.3 శాతం ఉండడంతో అధికారులు శోధించారు. దాంతో బెంగళూరు నగరం రాజరాజేశ్వరీనగర్ పరిధి జాలహళ్లిలోని ఎస్.ఎల్.వి.అపార్ట్‌మెంట్లో కొత్త ఓటర్ల నకిలీ దాఖలు కేంద్రం బయటపడింది.
అధికారుల నుంచి రహస్యంగా సేకరించిన కోడ్ సాయంతో కొత్త ఓటర్లను జాబితాలోకి ప్రవేశపెట్టి నకిలీ కార్డులూ సృష్టించారు. ఇలా రెండు ట్రంకుపెట్టెల్లో భద్రపరచిన 9,756 కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరో లక్ష ఓటర్ల గుర్తింపు కార్డులు తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన పత్రాలను పట్టుకున్నారు. వీటి తయారీకి వినియోగిస్తున్న ఐదు ల్యాప్‌ట్యాప్‌లు, ఓ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల అధికారి చెప్పారు.