దేశ రాజధాని నగరంలో మహిళా భద్రత మరోసారి ప్రశ్నార్థకమైన ఉదంతం బయటపడింది. ఢిల్లీ మెట్రోలోని ఓ స్టేషన్‌లో పట్టపగలే మహిళా జర‍్నలిస్టును వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జర్నలిస్టుగా పని చేస్తున్న యువతిని (25) ఐటీవో మెట్రో స్టేషన్లో ఓ కీచకుడు వేధించాడు. కావాలని ఆమెను తాకుతూ.. చేయి పట్టుకొని లాగడానికి ప్రయత్నించాడు. క్షణాల్లో అప్రమత్తమైన ఆ యువతి అతడి నుంచి తప్పించుకున్నారు. అత్యంత ధైర్యం ప్రదర్శించి ఆ ప్రబుద్ధుణ్ని పట్టుకున్నారు. జర్నలిస్టు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నవంబర్ 13న చోటు చేసుకుంది.
‘మొదట ఆ వ్యక్తి నన్ను తాకాడు. నేను ప్రతిఘటిస్తుండటంతో మరోసారి నా మీదికి దూసుకొచ్చాడు. ఆ సమయంలో చుట్టుపక్కల సెక్యూరిటీ సిబ్బందిగానీ, ప్రయాణికులుగానీ ఎవరూ లేరు. ధైర్యం తెచ్చుకుని అతణ్ని వెంబడించి పట్టుకున్నాను’ అని బాధితురాలు తెలిపింది. అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లో భద్రత పరిస్థితిని ఈ ఉదంతం ఎలుగెత్తి చాటింది. మహిళలపై వేధింపుల పర్వానికి అద్దం పట్టింది.