బీసీ బిల్లుకై మరో సామాజిక ఉద్యమం నిర్మిస్తాం.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
కృష్ణ – కాచిగూడ రైల్వే స్టేషన్ మధ్యన రైలు సర్వీసును ప్రారంభించడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఆదివారం రావడం స్వాగతిస్తున్నామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలలో బీసీ బిల్లు సాధనకై మరో సామాజిక ఉద్యమాన్ని ధర్మపోరాటం పేరిట తెలంగాణ నుండి నిర్మిస్తామని తెలిపారు. దశాబ్దాలుగా బీసీలు రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని తెలిపారు. మోడీజీ బీసీ బిల్లు ఏది అని ఆయన ప్రశ్నించారు.
జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తున్న బిజెపికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ దేశానికి పట్టిన పెద్ద సమస్య అంటే అది బీసీల సమస్య అని కాన్షీరామ్ చెప్పినట్లుగా బిజెపికి బీసీ సమస్యలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. బీసీ కులాల పట్ల బీజేపీ పార్టీ ధోరణి మార్చుకోవాలని అన్నారు. లేకుంటే రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.
రానున్న రోజులలో బీసీ సంఘాలు, కుల సంఘాలు ఉద్యమ నాయకులు, మేధావులు, న్యాయవాదులను కలుపుకొని పలు రూపాలలో సామాజిక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.