మునుగోడులో బీసీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టి.. గెలిపించుకోగలం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
హైదరాబాద్ లోని తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి , బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యోగేంద్ర మరియు పలువురు బీసీ నేతలు, కార్యకర్తలతో కలిసి వచ్చిన ఆయన మునుగోడు సీటు బీసీలకే ఇవ్వాలనే నినాదం చేశారు. ఈ అంశంలో అన్ని బీసీల సంఘాలు ఒకే మాటకు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు దుండ్ర కుమారస్వామి.
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ రాజకీయం కొనసాగుతోందని.. ఇకనైనా అక్కడ ఎమ్మెల్యే పదవిలో బీసీనే కూర్చోపెడదామని ప్రజలను కోరారు దుండ్ర కుమారస్వామి. గత కొన్ని దశాబ్దాలుగా మునుగోడులో ఓసీల పాలన సాగుతూ ఉంది.. బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో ఇకనైనా బీసీ అభ్యర్థిని గెలిపించుకుందామని పిలుపును ఇచ్చారు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఓసీల పాలన సాగుతూ ఉందని.. వారి పాలనకు అడ్డు కట్ట వేసే అవకాశం వచ్చిందని అన్నారు. 1967లో నుండి మునుగోడులో 12 సార్లు ఎన్నికలు జరిగినా.. ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని దుండ్ర కుమారస్వామి గుర్తు చేశారు. 7 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వగా.. 5 సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారని అన్నారు. వీరికి ఇన్ని రోజులూ పల్లకీ మోసింది బీసీలే.. కానీ బీసీలకు ఎటువంటి న్యాయం, నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదన్నారు కుమారస్వామి.
ఇక మునుగోడులో 2.20 లక్షల ఓట్లు ఉండగా.. ఇందులో 70 శాతం ఓట్లు బీసీలవే ఉన్నాయి. బీసీలంతా ఏకమై బీసీ అభ్యర్థిని గెలిపించుకోడానికి ఇదొక సువర్ణావకాశం.. కాబట్టి పార్టీలు బీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని కుమారస్వామి కోరారు. బీసీ అభ్యర్థిని నిలబెడితే పార్టీలకు అతీతంగా మునుగోడులో గెలిపించుకుంటామని దుండ్ర కుమారస్వామి హామీ ఇచ్చారు. బీసీ సంఘాలన్నీ కలిసి కట్టుగా పని చేస్తామని తెలిపారు. మునుగోడు నియోజకవర్గం లో బీసీ జనాభా అధికంగా ఉందని.. దానిని పాలించే హక్కు బీసీలదేనన్నారు కుమారస్వామి. ప్రధాన పార్టీలు బీసీ అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని.. లేదంటే బీసీ అభ్యర్థిని తామే పోటీకి పెట్టి గెలిపించుకొని చట్టసభలకు పంపుతామని హెచ్చరించారు దుండ్ర కుమారస్వామి. బీసీ సంఘాల సత్తాను తక్కువగా అంచనా వేయకండని.. బీసీలందరూ ఐక్యమయ్యే సమయం ఇదేనని అన్నారు. బీసీల అభివృద్ధి జరగాలంటే బీసీలే పదవుల్లో ఉండాలని.. మునుగోడు గడ్డ-బీసీలకు అడ్డా అని మరోసారి గుర్తు చేశారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. ఈ కార్యక్రమంలో బీసీ మహిళ సంఘం అధ్యక్షురాలు పద్మ, బీసీ మహిళా నేత దివ్య,బిసి దళ్ రంగరెడ్డి జిల్ల యూత్ ప్రెసిడెంట్ మరియు సత్తార్
ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.