మూడో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రైతులు తమ ఉత్పత్తులను మెరుగైన ధరకు అమ్ముకునే అవకాశం కల్పించేలా కేంద్రం చట్టం తెస్తోందని ఆమె ప్రకటించారు. రాష్ట్రాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా మెరుగైన ధరకు రైతులు ఎక్కడైనా ను అమ్ముకునేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రైతు పండించిన పంటను నిర్దిష్ట ప్రాంతంలోనే అతి కొద్ది మందికి మాత్రమే ఎందుకు అమ్ముకోవాలని ఆమె ఇప్పటివరకూ ఉన్న దళారీ వ్యవస్థను ఉద్దేశించి ప్రశ్నించారు. మెరుగైన ధరకు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా రైతు తన పంటను అమ్ముకునేలా చర్యలు తీసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించారు.
అంతర్ రాష్ట్ర రవాణాకు అడ్డంకులు తొలగిస్తామని, పంట వేసే సమయంలోనే రైతుకు కనీస మద్దతు ధర ఎంతో తెలిసేలా నిర్దిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇలాంటి ఏర్పాట్ల వల్ల లాభసాటి పంటలను రైతులు ఎంచుకునే వీలుంటుందని ఆమె చెప్పారు. సాంకేతికపరమైన సలహాలు, విత్తనాల్లాంటి సాయం రైతులకు అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దీని వల్ల మద్దతు ధర రాకుండా రైతు నష్టపోవడం ఉండదని నిర్మల చెప్పారు.
కూరగాయల రైతులను ఆదుకునేందుకు కూడా రూ.5 వేల కోట్లతో ప్రత్యేక విధానం తీసుకురాబోతున్నట్లు చెప్పారు. నిల్వ చేసే అవకాశం లేక టమాట లాంటి పంట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కోల్ట్ స్టోరేజీ లాంటి విధానంతో ఆరు నెలల పాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. కూరగాయల నిల్వతో పాటు మెరుగైన ధరలకు అమ్ముకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.
1955 నాటి అత్యవసర సరుకుల చట్టంలో కీలక మార్పులు తెస్తామని ప్రకటించారు. పరిస్థితులు, వాతావరణానికి తగ్గట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అనుకూలంగా మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. రైతులకు లాభం కలిగించి, వినియోగదారులకు ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ధరలను దళారీలు ప్రభావితం చేయడం, డిమాండ్‌ను పెంచేందుకు సప్లయ్‌ను అదుపు చేసేలాంటి చర్యలకు ఇక చెక్ పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తేల్చి చెప్పారు.