బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్
సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి
జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే కాదు. బాలికను సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టే దృఢ సంకల్పానికి నాంది పలకాల్సిన రోజు. హక్కులు, బాధ్యతలు, వివక్షత అనే మాటలతో సరిపెట్టుకోవడం కాదు, ఆగడాలకు సవాల్‌గా నిలిచే ధైర్యాన్ని, మగవాళ్లతో సమానమే అన్న భావజాలాన్ని కాదు, సమానత్వం ఒక మౌలిక హక్కు అన్న చైతన్యాన్ని బాలికలో, సమాజంలో పాతుకుపోవాలి.
“ఆడది అబల కాదు… ఆడదే సమాజానికి పునాది” అనే సత్యం నినాదంగా కాకుండా ఆచరణలోకి రావాల్సిన సమయం ఇది.
స్త్రీవర్గానికి పునాదైన బాలికలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించగల స్థాయిని కల్పించడం ఒక కుటుంబం బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి వర్గం బాధ్యత. స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు గడిచినా, స్వావలంబన ఉందని సగర్వంగా చెప్పుకునే పరిస్థితులు లేకపోవడం మన ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. రాజకీయ వ్యవస్థ, పాలనావ్యవస్థ, మేధావులు, చివరికి సామాన్య ప్రజలు కూడా ఈ వైఫల్యానికి బాధ్యత వహించాల్సిందే. అయితే సిగ్గుపడటం పరిష్కారం కాదు. దుర్మార్గ వ్యవస్థను ఛేదించడానికి మనం ఎందుకు సాహసం చేయడం లేదు? పాలనాపరమైన సంస్కరణలు ఎందుకు ముందుకు రావడం లేదు? విద్య మార్పుకు ఆయుధంగా ఎందుకు మారడం లేదు?
నోబెల్, జ్ఞానపీఠాలు గెలిచిన దేశమైనా సమాజంలో వివక్షత ఎందుకు ఇంకా ? స్త్రీ–పురుష సమాజంలో స్త్రీల పై ఆంక్షలు, అణచివేత, అహంభావం, హింస వంటి వికృతాలు కూకటి వేళ్లతో పెకిలించలేకపోవడానికి కారణం ఎవరు? నిజం ఏంటంటే, ఇందుకు అందరం బాధ్యులమే; మహిళలతో సహా.
తెలంగాణ సామెత గుర్తుచేస్తుంది,“ఇతరులపై వేలు చూపిస్తే, మిగతా వేళ్లు మనవైపే ఉంటాయి.” ఇతరులను నిందించడమే కాదు, మనల్ని మనమే పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.
జాతీయ, అంతర్జాతీయ బాలిక దినోత్సవాలను మొక్కుబడిగా జరుపుకుంటే బాలికల జీవితాల్లో మార్పు రాదు. భావజాలం ప్రజల్లోకి వెళ్లాలి. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు, ఇల్లు నుంచి వీధి వరకు చైతన్య విప్లవం జరగాలి. తెలంగాణ చరిత్రే సాక్ష్యం పోరాటం లేకుండా న్యాయం రాలేదు. ఫూలే చెప్పిన “విద్యే విముక్తి మార్గం” అనే మాట, అంబేద్కర్ పేర్కొన్న “సామాజిక న్యాయం లేకుండా ప్రజాస్వామ్యం అర్థహీనమే” అన్న సత్యం, మండల్ ఉద్యమం చాటిన సమానత్వం కోసం రాజ్యాంగ పోరాటం తప్పనిసరి అన్న సందేశం—ఈ మూడు కలిసి నేటి బాలిక ఉద్యమానికి దిశానిర్దేశం చేయాలి. చరిత్రలోని సంస్కర్తల బాటలో నడిచే ధైర్యం లేకపోతే భవిష్యత్తుకు అర్థం ఉండదు.
ఇప్పటివరకు సమాజాన్ని చైతన్యం రగిలించాం, కానీ మార్పు ఇంకా రాలేదు. “గింజ పాడైతే గోదాం పాడవుతుంది.” బాలిక భద్రత దెబ్బతింటే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. అత్యాచారాలు, అణచివేత, లైంగిక వేధింపులు ఆగాలంటే కఠిన చట్టాలు మాత్రమే కాదు, కఠిన అమలు కూడా కావాలి. పలుకుబడి ఉన్నవారికీ, రాజకీయ నేతల పిల్లలకూ చట్టం ఒకటే అని నిరూపించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. శిక్షల ద్వారా భయాన్ని కాదు, న్యాయంతో విశ్వాసాన్ని పెంచాలి.
నేడు విద్య, శాస్త్రం, క్రీడలు, పాలన—అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు. అయినా బాలికను బలహీనురాలిగా చూడటం మన అమానవీయ సంస్కృతికి నిదర్శనం. బాలిక ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది, కుటుంబం ఎదిగితే సమాజం ఎదుగుతుంది, సమాజం ఎదిగితే దేశం నిలబడుతుంది. ఈ సత్యాన్ని అంగీకరించకపోతే మన పురోగతి కాగితాలకే పరిమితం అవుతుంది.
జాతీయ బాలిక దినోత్సవం ఒక రోజుకు పరిమితం కాకూడదు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం అనే మూడు పదాలు మన జీవన విధానంగా మారాలి. పోరాటం లేకుండా న్యాయం రాదు; న్యాయం లేకుండా సమానత్వం రాదు; సమానత్వం లేకుండా సమాజం నిలబడదు. బాలికల ఆత్మగౌరవమే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం—ఈ సత్యాన్ని అంగీకరించిన రోజే జాతీయ బాలిక దినోత్సవానికి నిజమైన అర్థం వస్తుంది