10-12-2024
ప్రజా వీరుడు పండుగ సాయన్న చేసిన సాయం చిరకాలం నిలిచిపోతుంది:
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బడుగు బలహీన వర్గాలు, పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు పండుగ సాయన్న అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి అన్నారు. సోమవారం బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు శివ కుమార్ ఆధ్వర్యంలో పండుగ సాయన్న వర్ధంతి కార్యక్రమం తెలంగాణ, గన్ పార్క్ వద్ద నిర్వహించారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, శివకుమార్, BSP స్టేట్ కో ఆర్డినేటర్ బోయిని చంద్ర శేఖర్ ముదిరాజ్, ముదిరాజ్ వాణి సంపాదకులు ఉప్పరి నారాయణ ముదిరాజ్, ఉస్మానియా విద్యార్థి నాయకుడు ఆంజనేయులు ముదిరాజ్ తదితరులు, ఉదయ్ గంజి, నీలం సైదులు, మేధావులు ప్రజా సంఘాలు బీసీ నాయకులు పండుగ సాయన్నకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ప్రజా వీరుడు పండుగ సాయన్న చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తి అని తెలిపారు. గంధపు చెక్కల స్మగ్లర్లను, ఎర్ర చందనం స్మగ్లర్లను హీరోలుగా భావించే నేటి తరం యువత పండువుగా సాయన్నను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
పండుగ సాయన్న ఓ గొప్ప సామాజిక ఉద్యమ నాయకుడు, సమానత్వం కోసం పోరాటం చేసిన గొప్ప వీరుడు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, అభ్యున్నతి కోసం పోరాటం చేసిన యోధుడు . సమాజంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ,పేదల పాలిట ఆపద్భాందవుడిగా నిలిచాడు. వందేళ్ల కిందట ఈ నేల మీద తిరుగాడిన మహాపురుషుడిని ఇప్పటికీ స్మరించుకుంటున్నామంటే ఆయన ఇచ్చిన ఇంపాక్ట్ ఆ కాలంలోనే అలాంటిది.
పేదలకు సహాయం చేసే వ్యక్తిని ఆనాటి ఆధిపత్య వర్గాలు బందిపోటుగా చిత్రించారు. ప్రజల కోసం ఎంతో మందితో యుద్ధం చేశాడు.35–38 ఏళ్ల వయసులో చనిపోయినా ఆయనకు తెలంగాణ రాబిన్‌హుడ్, ప్రజా వీరుడుగా పేరు ఉంది. ప్రజలను హింసలకు గురిచేస్తూ దోచుకున్న దొరల ఖజానాలను కొల్లగొట్టాడు. సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు.
శివ ముదిరాజ్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలు ఆయన చరిత్రను తెలుసుకొనే ప్రయత్నాలు చేయాలి. అణగారిన వర్గాల కోసం తన జీవితం సర్వస్వాన్ని త్యాగం చేశాడు. భూస్వాములు, పెద్దల దగ్గర ధాన్యాన్ని, ధనాన్ని దోచి పేద ప్రజలకు పంచిపెట్టాడు. పీడిత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాయన్న పడిన తపన, వీరత్వం, త్యాగాలు చరిత్రలో నిలిచిపోయాయి.