బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, చట్ట సవరణకు ముందుకు రావడం బీసీల సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధి ప్రదర్శించినట్టుగా భావిస్తున్నాను. దీనికి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మలుపు అని, ఇది సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు..గత పాలనలో రిజర్వేషన్లు తగ్గించబడ్డాయని గుర్తుచేసిన ఆయన, అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించిన ఘనత బిఆర్‌ఎస్‌కే దక్కుతుందని విమర్శించారు. మరోవైపు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం కట్టుబడి కృషి చేస్తుంటే, టీఆర్‌ఎస్ మాత్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
రేవంత్ ప్రభుత్వం ప్రారంభం నుంచే రాష్ట్రంలో సమగ్ర కులసర్వే నిర్వహించి, వాటి ఆధారంగా బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపిందని ఆయన గుర్తుచేశారు. అంతేకాక, హైకోర్టు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన సందర్భంలో, ఆర్డినెన్స్ తీసుకురావడానికి కూడా ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.
బీసీ సమాజానికి ఇచ్చిన మాటకు కట్టుబడి, చట్టబద్ధంగా, శాసనబద్ధంగా ముందుకు రావడం ప్రభుత్వ అంకితభావానికి, ముఖ్యమంత్రి సామాజిక స్పృహకు నిదర్శనం అని కుమారస్వామి అభినందించారు. అదే సమయంలో, బిఆర్‌ఎస్, బీజేపీలు కూడా 42 శాతం రిజర్వేషన్లకు అండగా నిలవాలని, లేకపోతే బీసీ వర్గాల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బీజేపీకి నిజమైన నిబద్ధత ఉంటే, రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే ఆమోదింపజేసి రాష్ట్రానికి తిరిగి పంపించాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు.