ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి
సినీ నటి శ్రీదేవి అంతిమ యాత్ర అధికారిక లాంఛనాలతో ప్రారంభమైంది. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్ తారలతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే ముంబైకి తరలివెళ్లారు. శ్రీదేవి పార్థివ దేహానికి సంబంధించిన ఫొటోలు తొలిసారి బయటకు వచ్చాయి. మరి కాసేపట్లో అతిలోక సుందర అంత్యక్రియలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమెను చివరిసారి చూడటానికి వేల మంది తరలి వస్తున్నారు.
శ్రీదేవికి కాంచీవరం చీరలంటే చాలా ఇష్టమట. అందుకే ఆమె భౌతికకాయానికి బంగారు వర్ణంతో కూడిన కాంజీవరం చీరను కప్పి అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు. ఆమె భౌతికకాయానికి జాతీయ జెండాను కూడా కప్పారు. ఆమె భౌతికకాయాన్ని తరలిస్తున్న వాహనాన్ని పూర్తిగా తెలుపురంగు పూలతో అలంకరించారు. శ్రీదేవికి తెలుపు రంగంటే చాలా ఇష్టమట. అందుకే అంతా తెలుపు రంగు పూలతో అలంకరించారు. ఆమె భౌతికకాయం వెంట భర్త బోనీకపూర్, అర్జున్ కపూర్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. శ్రీదేవి హఠాన్మరణంతో ఆమె నివసించిన గ్రీన్ ఎకరాస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఈసారి హోలీ వేడుకలు జరుపుకోవడం లేదు. సెలబ్రేషన్ స్పోర్స్ట్ క్లబ్ నుంచి ఆమె భౌతికకాయాన్ని విలేపార్లే హిందూ శ్మశానవాటికకు తరలించారు.