పండుగ సాయన్న సిద్ధాంతాలు – బహుజన సమాజానికి మార్గదర్శకం
పండుగ సాయన్న జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో పోస్టర్ ఆవిష్కరణ చేసిన– జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National President BC Dal Dundra Kumara Swamy)
బహుజన వర్గాల అస్తిత్వ పోరాటానికి అంకితమైన మహోన్నతమైన జీవితం పండుగ సాయన్న గారిది. ఆయన సిద్ధాంతాలు ఈనాటి సమాజానికి మార్గదర్శకంగా నిలవాలన్న ఆకాంక్షతో ఆగస్టు 8న న్యూ ఢిల్లీలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి (Dundra Kumara Swamy)తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) నాయకుడు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకల పోస్టర్‌ను జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, “పండుగ సాయన్న(Panduga Sayanna )గారు కేవలం వ్యక్తి కాదు… ఒక యుగ చైతన్యం. కుల, మత బేధాలకు తావులేకుండా సమాజాన్ని సమానత్వ పథంలో నడిపించేందుకు తన జీవితాన్ని అంకితమిచ్చిన ఉద్యమ నేత,” అని కొనియాడారు.
“150 ఏళ్ల క్రితమే స్త్రీల విద్యపై దృష్టి సారించిన సాయన్న గారి ఆలోచనలు విప్లవాత్మకమైనవే. భజన మండళ్లను విద్యా కేంద్రాలుగా మలచిన ఆయన దూరదృష్టికి నేటి తరం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది,” అని పేర్కొన్నారు.
చెరువుల తవ్వకాలు, సాగునీటి వనరుల ఏర్పాటు ద్వారా గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిన ప్రజానాయకుడిగా సాయన్న గారి పేరును గుర్తు చేసుకున్నారు.
కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించిన నాయకుడిగా సాయన్న గారు సమాజానికి సమానత్వ సందేశాన్ని ఇచ్చినదిగా గుర్తు చేశారు. పండుగ సాయన్న జయంతిని ఉద్యమ దినోత్సవంగా జరుపుకుందాం
“పండుగ సాయన్న జయంతిని కేవలం ఓ ఆనవాయితీగా కాకుండా… బహుజనుల గౌరవదినంగా, ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఉద్యమ ఉత్సవంగా మారుస్తాం,” అని దుండ్ర కుమారస్వామి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డా. శివ ముదిరాజ్, సామాజికవేత్త డా. డి.పి. చారి, యాదవ్, మన్నె బ్రహ్మయ్య, సాయికిరణ్, రత్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.