జాతీయ ఓబీసీ సెమినార్ –
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం
సామాజిక న్యాయం కోసం బీసీల ఆత్మగౌరవ పోరాటానికి దేశవ్యాప్త పిలుపు
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National President BC Dal Dundra Kumara Swamy)
పార్లమెంటులో ఓబీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు సాధించుకునే వరకు దేశవ్యాప్తంగా జాతీయ ఉద్యమాన్ని కొనసాగిస్తామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు.(BC JAC)
బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఓబీసీ సెమినార్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ అడిషనల్ కలెక్టర్ రాజేశం, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రమాదేవి, తెలంగాణ సీపీఐ అధ్యక్షుడు వెంకటస్వామి, జాతీయ బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, వెంకటరమణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ ఉద్యమ నేతలు, మేధావులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఓబీసీల సామాజిక, విద్యా, రాజకీయ అభ్యున్నతి, చట్టసభల్లో రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వ వైఖరి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, కేంద్రంలో వెంటనే ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అది ఓబీసీల న్యాయమైన డిమాండ్ అని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమం తరహాలో బీసీ ఆత్మగౌరవ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా రగిలిస్తామని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా బీసీలు తమ హక్కులు సాధించుకుంటారని హెచ్చరించారు.
బీసీ వర్గాల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యం దేశవ్యాప్తంగా మరో విప్లవానికి నాంది పలుకుతోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించి, చట్టసభల్లో న్యాయమైన రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేశారు.
పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకువచ్చి షెడ్యూల్–9లో చేర్చకపోతే, అన్ని రాష్ట్రాల్లోని బీసీ మద్దతుదారులను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యారని, స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు దాటినా దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు ఇప్పటికీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం రాజకీయ కుట్రేనని విమర్శించారు.
బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అనేక పార్టీలు గతంలో చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తు చేస్తూ, ఇప్పటి పాలకులు కూడా ఆ పాఠాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సామాజిక న్యాయం సాధించే వరకు, చట్టసభల్లో ఓబీసీలకు న్యాయమైన వాటా దక్కే వరకు ఈ పోరాటం ఆగదని, బీసీల ఆత్మగౌరవ ఉద్యమం రానున్న రోజుల్లో దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందని దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు.