కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోర్టు కేసుల్లో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భూముల సమస్యలు ఇతరత్రా అంశాలపై ఎమ్మెల్యే అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్కారు భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని చెప్పారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూముల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకొని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆయా స్థలాల్లో పార్క్ లు, ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ భవనాలు, ప్రభుత్వ కళాశాలలు, స్మశాన వాటికల వంటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సరిత, కమిషనర్ గోపి (ఐఎఎస్), ఆర్ఐ జగదీష్, ఏసీపి శ్రీనివాస్ పాల్గొన్నారు.