సమయానుకూలంగా స్పందించి, అత్యంత సాహసంతో ప్రాణాలను పణంగా పెట్టి మరీ బాలుడిని కాపాడి రియల్ హీరోగా నిలిచిన రైల్వే ఉద్యోగి షెల్కే పై ప్రశంసల జల్లుకురవడమే కాదు విలువైన బహుమతులు కూడా లభిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన బాలుడిని రక్షించిన మయూర్ షెల్కేని స్వయంగా రైల్వే శాఖమంత్రి పియూష్ గోయల్ అభినందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ బహుమతిని కూడా ప్రకటించింది. షెల్కేకు జావా మోటార్ సైకిల్‌ను గిఫ్ట్‌గా ప్రకటించింది.
మయూర్ షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసనీయమంటూ క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా అభినందించారు. మొత్తం జావా కుటుంబం ఆయనను అభినందిస్తోందన్నారు. ఓ లెజెండ్‌కు ఉండే సత్తా ఆయనలో ఉందన్నారు. రైలు దూసుకొస్తున్నప్పటికీ బాలుడిని సురక్షితంగా కాపాడిన తీరు తమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని థరేజా పేర్కొన్నారు. జావా హీరోస్ ఇనీషియేషన్‌లో భాగంగా ఈ అవార్డు ఇస్తున్నామన్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఇలాంటి హీరోలను గుర్తించి జావా హీరోస్ పేరుతో సత్కరించనున్నామని వెల్లడించారు. దీనిపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. మూవీల్లోని సూపర్ హీరోలను మించిన హీరోగా మెరుగైన ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ ట్వీట్ చేశారు. జావా కుటుంబంలో మనమందరం అతనికి సెల్యూట్ చేద్దామన్నారు. అలాగే క్లిష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలో షెల్కే మనకు చూపించారంటూ ఆయన ప్రశంసించారు.