దేశీయంగా అక్టోబరులో మారుతీ సుజుకీ ఆల్టో కార్లు అత్యధికంగా విక్రయమయ్యాయి. ఆగస్టు, సెప్టెంబరుల్లో ఆల్టో ఆధిపత్యానికి మారుతీ కాంపాక్ట్ సెడాన్ మోడల్ డిజైర్ గండికొట్టిన సంగతి విదితమే. రెండు నెలల తరవాత మళ్లీ ఆల్టో తన హవా చూపినట్లయ్యింది. వాహన తయారీదార్ల సంఘం (సియామ్) తాజా గణాంకాల ప్రకారం.. అక్టోబరులో ఆల్టో కార్లు 19,447 విక్రయం కాగా, డిజైర్ కార్లు 17,447 అమ్ముడయ్యాయి.
ఆగస్టులో డిజైర్ (26,140 కార్లు) తొలిసారిగా ఆల్టో (21,521 కార్లు)ను అధిగమించింది. గత నెలలో అత్యధిక అమ్మకాలు జరిగిన 10 మోడళ్లలో 7 మారుతీ సుజుకీవి కాగా, మిగిలిన 3 హ్యుందాయ్ మోటార్ ఇండియాకు చెందినవి.