సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై రూ.6.52 మేర తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం 14.2కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర దేశరాజధాని దిల్లీలో రూ.507.42గా ఉంది. నేటి అర్ధరాత్రి నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయి. దీంతో సిలెండరు ధర రూ.500.90కి చేరిందని ఐఓసీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. జూన్ నెల నుంచి సిలెండరు ధర పెరుగుతూనే వచ్చింది. ఇప్పటి వరకు ఆరుసార్లు వంట గ్యాస్ ధరను పెంచారు. ఈ ఆరు నెలల్లో రూ.14.13 మేర గ్యాస్ ధర పెరిగింది.
రూపాయి విలువ బలపడటంతో పాటు, అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో ఎల్‌పీజీ ధరలు భారీగా తగ్గినట్లు ఐఓసీ వెల్లడించింది. ఇక సబ్సిడీయేతర సిలెండరు ధరపై రూ.133 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు సబ్సిడీయేతర సిలెండరు ధర రూ.942.50గా ఉంది. ఇక మీదట దిల్లీలో సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలెండరు ధర రూ.809.50గా ఉండనుంది. గృహ వినియోగదారులకు సబ్సిడీ కింద ఏటా 12 సిలెండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. సబ్సిడీ నగదును వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. డిసెంబరు నెల నుంచి సబ్సిడీ కింద వినియోగదారులకు రూ.308.60 నగదును బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. నవంబరు నెలలో చివరి సారిగా వంట గ్యాస్ సిలెండరు ధర పెంచారు. సిలెండరుపై రూ.2.94 మేర పెంచుతున్నట్లు ప్రకటించారు.