దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు అయిన విచారణ కమిషన్ శుక్రవారం ముగ్గురికి సమన్లు జారీ చేసింది. జయలలిత నిచ్చెలి శశికళ, అపోలో గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డికి కమిషన్ సమన్లు ఇచ్చింది. 15 రోజుల్లోగా నేరుగా విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. కాగా అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే.
జయలలిత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్ 5 న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆమె మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. జయ మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా, జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె వీరవిధేయుడు పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించింది. దీంతో విచారణ కమిషన్… ఇందుకు సంబంధించి ఒక్కొక్కరినీ విచారణ చేస్తోంది. తాజాగా శశికళతో పాటుగా ప్రతాప్ రెడ్డి, ప్రీతారెడ్డికి నోటీసులు ఇచ్చింది.