హైదరాబాద్ నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన అమీర్‌పేట- హైటెక్‌సిటీ మెట్రోరైలు మార్గంలో ప్రయాణం ప్రారంభమైంది. మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులో తాజా మార్గంతో కలుపుకొని 56 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్టయింది. దీంతో దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోరైల్ అవతరించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన హైటెక్‌సిటీకి మెట్రోరైలు అందుబాటులోకి రావడంపై జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేసే ఐటీ, ఇతర ఉద్యోగులు, ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట ఇంటర్‌చేంజ్ స్టేషన్‌లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హైటెక్‌సిటీకి వెళ్లే మెట్రోరైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం అదే రైల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, మెట్రో అధికారులు, ఇంజినీర్లతో కలిసి ప్రయాణించారు.
అమీర్‌పేట నుంచి ప్రారంభమైన రైలు 20 నిమిషాల్లో హైటెక్‌సిటీ స్టేషన్‌కు చేరుకుని, తిరిగి అదే ట్రాక్‌పై తిరుగుప్రయాణంలో 18 నిమిషాల్లోనే అమీర్‌పేటకు చేరుకుంది. అనంతరం సాయంత్రం నాలుగుగంటల నుంచి ప్రయాణికులను అనుమతించారు. ఇతరమార్గాల మాదిరిగానే ఉదయం 6.15 గంటలకు ప్రారంభమై రాత్రి 10.30 గంటలకు చివరి మెట్రో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఒకటవ కారిడార్‌కు సంబంధించి ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మధ్య (29 కిలోమీటర్లు), మూడో కారిడార్‌లో నాగోల్ నుంచి అమీర్‌పేట (17 కి.మీ.) వరకు గల మార్గాల్లో ప్రజలు ప్రయాణిస్తున్నారు. మూడో కారిడార్‌లో ఇప్పుడు అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కిలోమీటర్ల మార్గాన్ని గవర్నర్ ప్రారంభించారు. హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మరికొంత మార్గం నిర్మాణంలో ఉన్నది. తాజా ప్రారంభమైన మార్గంలో ఉన్నత ఆదాయవర్గాల నివాసాలు ఉండటంతోపాటు ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నగరం నలుమూలల నుంచి హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాలకు వస్తున్నందున ఈమార్గానికి భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు.