సమాజంలో ఎక్కడో అక్కడ మనకు కనిపించే కొన్ని ఆకృత్యాలు, భీతావహ దృశ్యాలు, హృదయ విధారక సంఘటనలు కాసేపు మన మనసుల్ని చలింపచేస్తాయి. ఆ క్షణంలో ఏదో చేసేయ్యాలనే ఆవేశం మనసులో పుడుతుంది. ఆపై ఎవరి కుటుంబ భాధ్యతల్లో వారు తలమునకలై పోయి యిలాంటి విషయాలు అతి సామాన్యంగా మర్చిపోతారు. కాని కొందరు ఇలాంటి విషయాలకు కేవలం అందరిలా స్పందించి ఊరుకోరు. విషయం మన కుటుంభానికి సంభందించిన అంశంకాదని, సమాజ భాద్యత అని అంతటితో వదిలెయ్యరు. ఉన్న కుటుంబ భాద్యతలతో పాటు సమాజ భాద్యతలు కుడా తలకెత్తుకుంటారు. అలా అని వారేమి శ్రీమంతులు కుడా అయి ఉండరు కాని వారు చేసే కొన్ని కార్యక్రమాలు చూస్తే మనుషుల్లో ఇంకా ఇలాంటివారు మనమధ్యలోనే ఉన్నారా అని ఆశ్చర్యానికి లోనవుతాం. వారి సేవా తత్పరతకు చేతులెత్తి నమస్కరిస్తాం. కన్నవాల్ల ప్రేమకు దూరమై, వారు అసలు ఎవరో కుడా తెలియని స్థితిలో ఉండి, కేవలం జీవం నిలుపుకోడానికి రోడ్డుమీద, చెత్తకుప్పల్లో చేతికిదొరికినది తింటూ, ఎండా, వానా, చలి అనే రుతుబాదలు కుడా తెలియని అభాగ్యులు, మనచే పిచ్చివారు అనే ముద్ర వేసుకుని రోడ్లపై తిరుగుతూ, ఎక్కడో అక్కడ బిక్కుబిక్కున బ్రతుకు వెల్లదీస్తూ అసలు ఈ సమాజానికే పట్టని మానసిక వికలాంగులను వెతుక్కుంటూ వెళ్లి వారిని అక్కున చేర్చుకొని కన్న బిడ్డల్లా ఆదరించి, వారి ఆలనా పాలనా చూసుకుంటూ, చివరికి అట్టి అభాగ్యులు మరణించినప్పుడు వారికి స్వయంగా దహన సంస్కారాలు కుడా నిర్వహిస్తూ నిజమైన మాధవ సేవ చేస్తున్న వారిని ఏమి పిలవాలి? ఇలాంటి మాతృమూర్తియే నిజామాబాద్ జిల్లా, భోధన్ కు చెందిన శ్రీమతి శ్రీదేవి రవికిరణ్ గారు.
తనకున్న చింతల్లేని చిన్న కుటుంభం, కుటుంభ పోషణకు మరోచిన్న కిరాణ కొట్టు, సాఫీగా సాగే జీవితం మాత్రమే తాను చాలనుకోలేదు. రోడ్లవెంట, చెత్త కుప్పల వెంట అత్యంత దీనమైన స్థితిలో ఉండే మానసిక వికలాంగులను చూసినప్పుడల్లా వారి కోసం తనవంతు భాద్యతగా ఏదో చెయ్యాలని తపించేవారు. శ్రీమతి శ్రీదేవి గారితో పాటు వారి భర్త రవి కిరణ్ గారు కుడా అవే భావాలు కలిగి ఉండడంతో ఇద్దరు కలిసి ఇలాంటి మానసిక వికలాంగుల కొరకు, కడుపున పుట్టిన పిల్లలచే నిరాదరణకు గురై అనాధలుగా మారిన వృద్ధుల కొరకు ఒక శరణాలయం స్థాపించి నడపాలనుకున్నారు. తనకు పుట్టింటివారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన రెండెకరాల వ్యవసాయ భూమిని అమ్మి వచ్చిన 2 లక్షల రూపాయలను నగదుతో, తన 3 సం.ల పాప పల్లవి పేరుమీద “పల్లవి అనాధ వృద్ధాప్య మెంటల్లీ రిటార్దేడ్ ఆశ్రమం” పేరిట 2005వ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా పోతంచెట్టిపల్లి గ్రామంలో 3 గదులు, చుట్టూ గోడ కల్గిన కొంత స్థలాన్ని అద్దెకు తీసుకోని తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆశ్రమం స్థాపించిన తోలినాళ్లలో అప్పుడే తమకు వచ్చిన సమాచారం ఆధారంగా మేడ్చల్ బస్సుస్టాండ్ చేరువలో చెత్తకుప్పల వద్ద ఒక మానసిక వికలాంగురాలు ఉందని తెల్సుకొని ఈ దంపతులు అక్కడికి వెళ్లి ఆమెను స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి తమతో పాటు వారి ఆశ్రమానికి తీసుకెళ్ళి, 3 గంటలపాటు శ్రమించి ఆ మహిళ తలకు వ్రేలాడుతున్న 10 కేజీ లకు పైగా అట్టలు కట్టి ఉన్న కేశాలను క్షవరం చేసి, స్నానం చేయించి, మంచి వస్త్రములు ధరింపచేసి లక్ష్మీ అని పేరుపెట్టి ఆశ్రమంలో సపర్యలు చేసారు. అలా ఒక మానసిక వికలాంగ మహిళతో మొదలైన ఆశ్రమ కార్యకలాపాలు, అప్పటికే చాలామంది మానసిక వికలాంగులను చేరదీసి వారు చేస్తున్న నిస్వార్ధ సేవకు చలించిన ఒక దాత ప్రస్తుతం ఆశ్రమం నడుస్తున్న దుండిగల్ గ్రామంలోని 700 గజాల స్థలాన్ని విరాళంగా ఇవ్వగా, మరికొంతమంది దాతలు అక్కడ రూముల నిర్మాణానికి విరాళాలు అందివ్వడంతో 2007 సం.లో అప్పటి మెదక్ జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ.బి.వి.వి.ఎస్ మూర్తి గారి సహకారంతో ఆశ్రమాన్ని చట్టపరంగా రిజిస్టర్ చేసి నూతన భవన నిర్మాణం గావించారు. అప్పటికి ఉన్న కొద్ది స్థలంలోనే ఒకవైపు తన కుటుంభం తో సహా అక్కడ ఆశ్రయం పొందుతున్న మానసిక వికలంగులతోనే జీవిస్తూ అందరికి అమ్మలా, ఆశ్రమాన్నే తన కుటుంబంగా భావిస్తూ, అదే నిజమైన మాధవ సేవగా భావిస్తున్న శ్రీమతి శ్రీదేవి గారు మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.
ఆశ్రమం మొదలుపెట్టిన తొలినాళ్ళలో చేతిలో ఉన్న కాస్త ధనం అయిపోతే, ఆశ్రమ నిర్వహణ కష్టం అయిపోయి కొద్దిరోజులకే మూతపడుతుందనే ఉద్దేశంతో రోజువారి ఖర్చుల కోసం ఎంతో కొంత డబ్బు సమకూరే విధంగా ముందు చూపుతో ఒక చిన్న పాటి డైరీ ఫారం మొదలుపెట్టి, పాలు అమ్మగా వచ్చిన ఆదాయంతోనే ఆశ్రమం నిర్వచించే వారు శ్రీమతి శ్రీదేవి, రవి కిరణ్ గార్లు. ఈరోజుకి ఈ ఆశ్రమంలో ఆదరింప పడుతున్న వారి సంఖ్య 42మంది వరకు ఉంది. శ్రీమతి శ్రీదేవి గారి సోదరుడు, తల్లి తండ్రులు కుడా ఆశ్రమంలోనే ఉంటూ ఈ అభాగ్యులకు సేవ చేస్తున్నారు. వీరికి వైద్యపరంగా సహకరించడానికి పెద్ద మనసు ఉన్న డాక్టర్లు, రక్షణార్ధం అనునిత్యం సహకరించే స్థానిక పోలీసులు, వీరి సేవలను బయట ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా మిత్రులు, సహకరిస్తున్న ఇతర శేయోభిలషులు, ఉదాత్తమైన దాతలు ఈ ఆశ్రమం ఇంత విజయవంతంగా నడవడానికి కారణమని శ్రీమతి శ్రీదేవి గారు అందరికి కృతజ్ఞతలని తెలియజేస్తు ఉంటారు. విద్యాపరంగా బి.ఎ. సైకాలజీ చదివిన శ్రీమతి శ్రీదేవి గారు మానసిక వికలాంగులను సరియైన రీతిలో అర్ధం చేసుకొని, వారిలో మానసిక పరవర్తన తీసుకురావడం కొరకు అహర్నిశం శ్రమిస్తూ చాలామందిలో వారిపనులు వారు చేసుకునేట్టుగా శిక్షణనివ్వడమే కాకుండా, ఆశ్రమంలో తోటి వారికి కుడా చిన్న చిన్న పనుల్లో సహాయపడేట్టు తీర్చి దిద్దారు. అంతే కాకుండా, ఇక్కడి స్థానిక దుండిగల్ పోలీస్ స్టేషన్ లో అవసరమైన సందర్భాల్లో భార్యాభర్తల గొడవలకు, కుటుంభ కలహాలకు, వ్యసనపరులకు సంబంధించి కౌన్సిలింగ్ తరగతులు కుడా నిర్వహిస్తూ ఉంటారు.
కేవలం 30 సం.ల అతిచిన్న వయసులోనే ఇలాంటి ఆశయాన్ని, సమాజ భాద్యతను భుజానికెత్తుకొని, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి గత 14 సం.లు గా తన శక్తికి మించి ఆశ్రమ నిర్వాహణ చేస్తున్న ఆమె, భగవంతుడు ఆశీర్వదిస్తే ఇలాంటి అభాగ్యులైన మానసిక రోగులు, మతిస్థిమితం లేని మహిళలు, ఈ జంట నగరాల్లోనే కాదు ఈ రాష్ట్రంలోనే రోడ్లవెంట, చెత్త కుప్పల వెంట ఉండకూడదని, మనవ మృగాల చేతుల్లో అత్యాచారాలకు గురికాకుడదని, అటువంటి వారంతా తమ ఆశ్రమంలో, తమదిగా భావించే కుటుంభంలో సభ్యులై తమ రక్షణలో వారి మిగిలి ఉన్న జీవితం గడుపుతూ ఎంతో కొంత మానసిక పరివర్తన చెందుతూ ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని అభిలషించే శ్రీమతి శ్రీదేవి గారి మాటల్లోని ధృడమైన సంకల్పం, మొక్కవోని ఆమె ఆత్మస్థైర్యం అక్కడికి వచ్చే సందర్శకుల మనస్సుల్లో ఆర్ధ్రతను నింపుతుంది. ఆమె ఆశయానికి కేవలం అభినందనలు మాత్రమె తెలిపి ఊరుకోకుండా, మనమంతా ఆ మానసిక వికలాంగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా దాతృత్వాన్ని చాటుకొని చేయుతనివ్వాల్సిన అవసరం ఎంతో ఉంది.
రోడ్లపైన తారసపడే ఇటువంటి మానసిక వికలాంగ మహిళలను ఎవరైనా గమనించినట్టైతే “పల్లవి అనాధ వృద్ధ్యాప్య మెంటల్లీ రిటార్దేడ్ ఆశ్రమం” వారి హెల్ప్ లైన్ నం.8686895085 కు తెలియచేయమని, వీలైతే పెద్దమనసు చేసుకొని వీరి ఆశ్రమం వరకు తీసుకొచ్చి అప్పగించమని శ్రీమతి శ్రీదేవి గారు వినమ్రంగా వేడుకుంటున్నారు.
–
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more