బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆవిర్భావం(BC JAC)
రాష్ట్ర బందుకు పూర్తి మద్దతు
“బీసీల హక్కులు, రిజర్వేషన్లకై సమరం మొదలైంది” — రాజ్యాంగ సవరణ అవసరం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
దేశంలో బీసీలు దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు కూడా భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.“సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదు — అది భారత రాజ్యాంగం తెలిపిన హక్కు” అని ఆయన స్పష్టం చేశారు.
కాచిగూడలో యువజన, కులసంఘాల నేతలు, బీసీ సంఘ నేతలు, న్యాయవాదులతో కూడిన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అధ్యక్షత వహించారు.(National President BC Dal Dundra Kumara Swamy)
జాతీయ బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ జాతీయ చైర్మన్‌గా దుండ్ర కుమారస్వామిని ఈ సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రేపు అందరిని సమావేశపరిచి పూర్తి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని కుమారస్వామి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 9 అమలుపై హైకోర్టు స్టే విధించడం విచారకరమని అన్నారు.“ఇది బీసీల ఆత్మగౌరవం, సమాన హక్కుల కోసం పోరాటం. ఇక భారీ ఆందోళన తప్పదని” దుండ్ర కుమారస్వామి ప్రకటించారు.
ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర బందుకు యావత్ బీసీ సమాజం, మేధావులు, యువత, మహిళలు, కార్మికులు, వృత్తిదారులు, కార్పొరేట్ ఉద్యోగులు వరకు అందరూ ఐక్యంగా మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.
“కేంద్రం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలి” అని డిమాండ్ చేశారు.
“బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే రాజ్యాంగంలోని షెడ్యూల్–9లో చేర్చాలి. సుప్రీంకోర్టు జోక్యానికి గురికాకుండా రక్షణ కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలి. లేదంటే దేశవ్యాప్తంగా బీసీ సమాజం చరిత్రాత్మక ఉద్యమానికి సిద్ధమవుతుంది,” అని కుమారస్వామి హెచ్చరించారు.
జాతీయ బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఏర్పాటును శుభసూచికమని ఆయన తెలిపారు.ఈ జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బీసీ యువత, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, కులసంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, కులవృత్తిదారులు, ఎంబీసీలు, సంచార కులాలు, అర్థసంచార కులాలు కలిసి “అఖిలపక్ష బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ” భాగస్వాములు అవుతారని తెలిపారు.
ఈ జేఏసీ దేశవ్యాప్తంగా సమన్వయంగా పనిచేసి బీసీ హక్కుల కోసం నిరంతర ఆందోళనలను కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.
“ఇది రాజకీయ అంశం కాదు — ఆత్మగౌరవ పోరాటం” అని అన్నారు. ఇది సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం సాగించే ఉద్యమం” అని కుమారస్వామి స్పష్టం చేశారు.బీసీల ఆవేదనను కేంద్రం వినాలి — లేకపోతే ప్రజల నిరసన గళం దేశాన్ని కదిలిస్తుంది” అని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి జాతీయ బీసీల యూత్ ప్రెసిడెంట్ రూబీన్ గౌడ్, న్యాయవాదులు, కార్మిక సంఘ నేతలు, కులసంఘాల బీసీ నేతలు పాల్గొన్నారు.