బీసీ కుల వృత్తుల పరిరక్షణ కై కృషి – బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి
అంతరించిపోతున్న బీసీ కుల వృత్తుల మరియు సేవా వృత్తుల కాపాడుట మరియు పరిరక్షణకై బీసీ దళ్ కృషి చేస్తుందని బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుంద్ర కుమారస్వామి తెలిపారు. ఆధునీకరణ మరియు ప్రైవేటీకరణ పేరుతో అనేక కులవృత్తి , సేవ వృత్తులవారు శ్రమ దోపిడి కి గురి అవుతున్నారు. ప్రస్తుతం ప్రతి కులవృత్తిలో బడా వ్యాపారులు లేక ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు జోక్యం చేసుకొని కులవృత్తులను నిర్వీర్యం చేస్తున్నారని ఈ సందర్భంగా కుమారస్వామి తెలిపారు. కొన్ని వృత్తులు అంతరించి పోయే స్థాయిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కుల వృత్తులను ఇతర కులం లేదా మతం వారు వృత్తిని నిర్వహించి అంతర్గత మనస్పర్ధలు, మరియు శ్రమ దోపిడీ గావించి తద్వారా కుల వృత్తులు నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు.
నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కుల వృత్తుల మరియు సేవా వృద్ధుల పరిరక్షణకై ప్రత్యేక చట్టం తీసుకురావాలి, వృత్తి భద్రత మరియు ఉపాధి హామీ కల్పించి చక్కటి క్రయ విక్రయ వేదిక కల్పించి , కులవృత్తులను ప్రోత్సహించాలి. అలాగే ప్రతి కులానికి ప్రత్యేక కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పాలకమండలి నియమించాలి, మరియు వాటికి నిధులు మంజూరు చేయాలి.
సమాజం లో జరుగుతున్నా అన్యాయాలను , సంఘటనలను కులం పేరుతో , కుల వృత్తి పేరుతో ముడి పెట్టి కుల వృత్తులు చేసుకునే వారి ఆత్మ గౌరవం దెబ్బ తీసి కులం , కుల వృత్తుల పేర్లు చెప్పుకోవాలంటే సంకోచించే పరిస్తుతులు తీసుకవచ్చారు . వేరే గత్యంతరం లేక కొంతమంది జీవనోపాధికై కులవృత్తులను చేస్తున్నారు. కులం పేరు చెప్పుకో లేక పర్యాయ పదాలు వాడడం లేదా, కులం పేరు లో మార్పులు చేర్పులు ఎన్ని జరిగాయో మనకు తెలియనిది లేదు. అట్టి వారు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలని అనే ఆలోచన ఉన్నా ఆర్థిక పరిస్థితులు బాగు లేక, మరియు ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేక చాలా ఉంది తమ పిల్లలును కూడా ఈ కుల వృత్తుల ఊబి లో గత్యంతరం లేక దింపుతున్నారు.
కొన్ని కులవృత్తులను స్మూక్షంగా పరిశీలిస్తే వారు ఎదుర్కొంటున్న సమస్యలు, మరియు ఆధునీకరణ ఇతరుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
కుమ్మరి :
మట్టితో కుండలు చేసి వాటిని కాల్చి రైతులకు అందించేవారు. వీరికి ప్రతిఫలంగా మేర, వరి తదితరం ఇచ్చేవారు. పెద్ద వస్తువులైన బాన, తొట్టి, వడ మొదలగువాటికి కొంత ధాన్యం తీసుకుని ఇచ్చేవారు. పెండ్లి సందర్భాల్లో కుండలు కుమ్మరి వారే ఇవ్వాలి. కొన్ని కుండలకు అందమైన బొమ్మలు వేసి ఇచ్చేవారు. ఇవి పెండ్లిండ్లకు అత్యవసరం. అదే విధంగా ఎవరైనా మరణించినా ఆ కార్యక్రమాలకు కొత్త కుండ అవసరం. వాటిని కూడా కుమ్మరి సమకూర్చేవారు. వీటి స్థానంలో లోహపు పాత్రలు వచ్చాయి. ఎండాకాలం వచ్చిందంటే తాగడానికి చల్లటి నీరు అవసరం. నిరుపేదలు ఎక్కువగా కుండలనే ఫ్రిజ్‌లుగా వాడుకునేవారు. వీటిని కూడా కుమ్మరి అందించేవారు. పాలు కాచడానికి, మజ్జిగ చిలకడానికి, పెరుగు తోడేయడానికి కుండలే ప్రధాన పాత్ర పోషించేవి. దేవుని సన్నిధిలో ప్రమిదలు, దీపావళికి బొమ్మలు వీరే తయారుచేసేవారు. ప్రస్తుతం మట్టితో చేసే ఈ వస్తువులు దొరకట్లేదనే చెప్పాలి.
రజకులు :
గ్రామాల్లో రజకులది చాలా ప్రధానమైన వృత్తి. వారి వారసత్వ హక్కు కూడా రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక చాకలి కుటుంబం ఉండేది. వారు వేరే వారి బట్టలు ఉతకరాదు. ఒక చాకలికి ఇద్దరు మగ పిల్లలు ఉంటే వారు వేరే పోదల్చుకుంటే సమీపంలో ఉన్న ఊర్లను పంచుకునేవారు. వీరు లేనిదే గ్రామాల్లో ఎలాంటి సాంప్రదాయమైన కార్యక్రమాలు జరిగేవి కావు. వీరి ముఖ్యమైన పని అందరి బట్టలు శుభ్రంగా ఉతికి తేవడం. పెండ్లి పత్రికలు రాకముందు పెండ్లి పిలుపుకు వీరినే పంపించేవారు. తమలపాకులు, వక్కలు ఇచ్చి ప్రతి ఇంటికి వేరే ఊళ్లో ఉన్న బంధువులకు చెప్పి రమ్మని చాకలిని పంపేవారు. సొంతవారు పిలిచేకన్నా చాకలి పిలుపుకే గౌరవం, మర్యాద, సాంప్రదాయం. అంత గొప్పతనం వీరికి ఉండేది. ఇప్పుడు ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. పట్టణాల్లో, కళ్యాణ మండపాల్లో జరిగే కార్యక్రమాలు వారి అవసరాలు లేకుండానే జరిగిపోతున్నాయి. బట్టలు ఉతికే మిషన్లు రావడంతో వీరి వృత్తి కనుమరుగవుతోంది.
అరెకటిక :
పెళ్లైనా ,పేరెంటమైనా కార్యము ఏదైనా గాని జరిగి అందులో మాంసాహార వంటలు ప్రత్యేకం. అందులో ముఖ్యంగా మాంసము ఉంటేనే ఆ విందు సార్థకమవుతుంది దీనికి కులం మతం పేద ధనిక వర్గాల తేడా లేదు. ప్రతి కుల వృత్తి లో ఇతరులు చేయడం , ప్రివేటీకరణ సాధారణం కానీ అరెకటిక కులం లో స్వయంగా ఇంటింటికి మట్టన్ , సబ్సిడీ మట్టన్, మూవింగ్ స్లాటర్ హౌస్ వంటి స్కీముల తో కుల వృత్తుదారులను అభద్రతా భావానికి గురి చేసి కుల వృత్తులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం భాదకరం.
కంసాలి :లోహపు వస్తువులను తయారు చేసేవారిని కంసాలి అనేవారు. వీరు కత్తులు, గొడ్డళ్లు, కొడవళ్లు వంటి లోహపు పనిముట్లు ఎక్కువగా తయారుచేసేవారు. ఇప్పుడు వీరి అవసరం లేకుండా పోయింది. అయినా యంత్రాలతో తయారుచేసే రెడీమెడ్ వస్తువులు ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి. ఈతరం పిల్లలకు కంసాలి అన్నా, వారు ఉపయోగించే కొలుములు అన్నా అసలు తెలియకుండా పోయింది. ఇప్పుడు పొలం కోతకు వస్తే మిషన్‌లతో కోయిస్తున్నారు. గ్యాస్ పొయ్యి వచ్చిన తర్వాత గొడ్డలి అవసరం పోయింది.
నయీ బ్రాహ్మణ :వీరి వృత్తి కూడా ఆనాటి సమాజంలో చాలా ప్రధానమైనది. జుట్టు కత్తిరించడం, గడ్డం చేయడం వంటివి చేసేవారు. కాలిగోర్లు తీసే సాధనం, చిన్న కత్తెర, సానరాయి, చిప్పలాంటి గిన్నె, బ్రష్, అద్దం వీటిని పెట్టుకోవడానికి ఒక సంచి దీనిని అడపము అనేవారు. చాలా మంది ఇతర పనుల్లో స్థిరపడగా కొంత షాపులను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రివెటీకారణ మరియు ఇతరులు ఈ వృత్తిని చేపట్టి వీరి పొట్ట కొడుతున్నారు.
ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి , అభివృద్ది చేసి కుల వృత్తి దారులను , సేవ వృత్తి దారులను అండగా నిలవాలని కుమార స్వామి తెలిపారు.