- రోడ్డు ప్రమాదాల నివారణలో యువత భాగస్వామ్యం కావాలి : రాజశేఖర్ రెడ్డి
- – నల్లగొండ మండల పరిధిలో యువత, ప్రజలకు అవగాహన
- – యువత భాగస్వామ్యంతో మరిన్ని ఫలితాలు
- – రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన అవసరం
నల్లగొండ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణలో గ్రామీణ ప్రాంత యువత భాగస్వామ్యం కావడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని నల్లగొండ రూరల్ ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
సోమవారం నల్లగొండ మండల పరిధిలో చర్లపల్లిలో రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రూరల్ ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతు.. చర్లపల్లి యువతను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేసిన పోలీసులు ఇకపై గ్రామీణ ప్రాంతాల యువతను తమతో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రమాదాల నివారణలో మంచి ఫలితాలు సాధించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలకు గురి కాకుండా పాటించాల్సిన నియమాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. టూవిలర్స్ నడిపే వ్యక్తులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, కారులో ప్రయాణం చేసే సమయంలో విధిగా సీటు బెల్టు ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కావద్దని ఆయన ప్రజలను కోరారు. జాతీయ, రాష్ట్ర రహదారులలో ప్రయాణం చేసే సమయంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపవద్దని కేవలం సూచించిన లే బై లలలో మాత్రమే వాహనాలను నిలపాలని ఆయన సూచించారు. వాహనాల డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని, ఆటోలలో వాహన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, ప్రతి వాహనదారుడు విధిగా వేగ పరిమితి పాటించాలని, సూచించిన రోడ్లపై ఎదురు ప్రయాణం చేయవద్దని ఆయన సూచించారు. వీటితో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన ఉండాలని అప్పుడే ప్రమాదాలకు గురి కాకుండా ఉండవచ్చన్నారు. ఇలాంటి సూచనలను యువత పోలీస్ శాఖతో భాగస్వామ్యం కావడం ద్వారా ప్రతి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో పి.ఎస్.ఐ. ఆంజనేయులు, నాగేశ్వర్ రావు, ప్రకాష్, నాగరాజు, సైదులు, యాదవ సంఘం అధ్యక్షుడు సత్తయ్య, సాయి, మధు, పోలీస్ సిబ్బంది, చర్లపల్లి యువత, ప్రజలు పాల్గొన్నారు.