ఆర్కేనగర్ ఉప ఎన్నిక
తమిళనాడులోని ఆర్కే నగర్‌లో దినకరన్ విజయం నేపథ్యంలో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలింది. దినకరన్ గెలిచినట్లు ప్రకటించగానే ఆయన నివాసం వద్దకు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దినకరన్‌కు పార్టీ పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. జయ వారసులు శశికళ – దినకరన్ అంటూ వ్యాఖ్యానించారు. గెలుపు అనంతరం దినకరన్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు తనప నమ్మకం ఉంచారని చెప్పారు. అమ్మ ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు.


ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో చిన్నమ్మ శశికళ వర్గం నేత, స్వతంత్ర అభ్యర్థి దినకరన్ ఘన విజయం సాధించారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలకు షాకిస్తూ ఆయన 40,707 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపుతో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలింది. 19 రౌండ్లు లెక్కించారు. దినకరన్ అమ్మ జయలలిత కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గతంలో జయలలిత సాధించిన మెజార్టీని దాటారు. డీఎంకే, బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలు కూడా డిపాజిట్ కోల్పోయాయి.
దినకరన్‌కు 89,013 ఓట్లు, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌కు 47,115 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుధు గణేష్‌కు 24,005, నామ్ తమిళర్ పార్టీకి 3,802 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కారు నాగరాజన్‌కు 1,368 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.