నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై… జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది , ప్రముఖ సామాజికవేత్త, దుండ్ర కుమారస్వామి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. హాస్టల్‌లో 40 మంది బాలికలు ఉంటుండగా… వారిలో 35 మందికి చికెన్ కర్రీ, పులిహోర తినిన తర్వాత వాంతులు, విరేచనాలు మొదలయ్యాయని.. ఫిటీషన్ లో పేర్కొన్నారు. 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై… స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని దుండ్ర కుమార స్వామి కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలు విద్యార్థుల ఆరోగ్య హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించడానికి… ఆరోగ్యంగా ఉండేందుకు హక్కు ఉందని… ఈ హక్కు విద్యార్థులకు కాలరాస్తున్నారని పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్యం, సంబంధిత శాఖల మధ్య బాధ్యతలు స్పష్టంగా లేకపోవడమే… ఈ సంఘటనకు కారణమన్నారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా… స్వతంత్ర కమిటీని వేసి విచారణ చేయాలని కోరారు.
ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్… ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని… హెచ్చార్సీ ఆదేశించింది.
